Appam, Appam - Telugu

జూలై 31 – అద్భుతములను ధ్యానించుడి!

“నా ఆత్మ నాలో క్రుంగియున్నది, నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను, నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను; నేను నీ చేతుల పని యోచించుచున్నాను” (కీర్తనలు. 143:4,5).

పైన చెప్పబడిన వచనమునందు ప్రత్యేకముగా మూడు మాటలను గమనించుడి. జ్ఞాపకము చేసుకొనుచున్నాను, ధ్యానించుచున్నాను, యోచించుచున్నాను అను మూడు మాటలైయున్నవి. అవును అదే ధ్యానించుటలో మంచి పద్ధతి. మొదటిది, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుడి. మీరు మునుపు దీనులై హీనస్థితిలో ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకోవలసినది మీ బాధ్యత. ప్రభువు ఎంతటి ప్రేమతో మిమ్ములను వెదకి వచ్చి, లేవనెత్తి, తన యొక్క బిడ్డగా మార్చేను అను సంగతిని మర్చిపోకుడి.

నేను మాటిమాటికి నా యొక్క పూర్వకాలమును ఆలోచించి చూస్తూ ఉంటాను. ఒకటవ తరగతి నుండి ఏయే ఉపాధ్యాయులు నాకు పాఠములను నేర్పించిరి అను సంగతిని, చిన్ననాటి నుండి నాకు లభించిన స్నేహితులను గూర్చియు, వారి మధ్య ప్రభువు నన్ను గొప్ప ఔన్నత్యముతో హెచ్చించుటను గూర్చి స్మరించి జ్ఞాపకము చేసుకొనుచుండగా దేవుని ప్రేమ చేత నా అంతరంగము ఉప్పొంగుచున్నది.

అవును, ఆయన క్రియలన్నియును ధ్యానించుటకు బహు చక్కనివి. ఆయన చేతి పనియు ఎంతటి మహాతరమైనవి! అంతటితో ఆగిపోకుడి. కీర్తనాకారుడు చెప్పుచున్నాడు: “ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి; ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని ధ్యానించి సంభాషణచేయుడి” (కీర్తనలు. 105:2).

ప్రభువు యొక్క క్రియలన్నిటిని ధ్యానించుచు ఉన్న గిద్యోను యొక్క అంతరంగమునందు, ‘మా పిత్తల ద్వారా అరుదైన గొప్ప కార్యములను చేసిన ప్రభువు ఎందుకని మా దినములలో చేయలేదు అను ప్రశ్న లేచెను. కావున గిద్యోను తనకు ప్రత్యక్షమైన దేవదూతను చూచి: “చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన యెడల, ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను?” అని అడిగెను (న్యాయా. 6:13).

అట్టి ధ్యానము యొక్క ప్రతిఫలము ఏమిటి? తాను కలిగియున్న ఆ బలముతో ప్రభువు కొరకు లేచి బయలుదేరెను. పితరులతో ఉన్నవాడు నాతో కూడా ఉన్నాడు అను గొప్ప విశ్వాసము కలిగెను. దేవుని బలము ఆయనపై దిగివచ్చెను. కావున కేవలము మూడు వందల మందితో సముద్రపు ఇసుక రేణుల వంటి మిద్యానీయులను ఆయన నిర్మూలము చేసి జయము పొందెను.

“నా పరిచర్యకు గల విజయపు రహస్యము కల్వరి యొక్క ధ్యానమే. మూడు దినములు సిలువను ధ్యానించి చూస్తూ ఉంటూ, ఆ తర్వాత వెళ్లి ప్రసంగించుచున్నప్పుడు, బలమైన అద్భుతములు జరుగుటను చూచుచున్నాను” అని ప్రభువు చేత బహు బలముగా వాడబడుచున్న ఒక సేవకుడు చెప్పెను.

దేవుని బిడ్డలారా, ప్రభువును ఎంతకెంతకు మీరు ధ్యానించుచున్నారో అంతకంతకు వ్యక్తిగత జీవితమునందు పరిశుద్ధత నొందుదురు. దేవునితో లోతైన సహవాసమును కలిగియుందురు.

నేటి ధ్యానమునకై: “నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని” (1. కోరింథీ. 2:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.