జూన్ 24 – ఆశ్రయమైయున్నవాడు!
“శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము; నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును; ఆయన నీ యెదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి, నశింపజేయుమనెను” (ద్వితి. 33:27).
ప్రభువు మనకు ఆశ్రయమైయున్నవాడు. అట్టి ఆశ్రయము సాధారణమైన ఆశ్రయము కాదు. మిగుల అత్యధికమైన ఆశ్రయము. శాశ్వతుడైన దేవుడు నీకు ఆశ్రయము అని మోషే భక్తుడు సెలవిచ్చుటను చూడుడి.
శ్రీలంక దేశము నుండి వచ్చిన ఒక సేవకున్ని నేను దర్శించాను. ఆయన మిగుల కన్నీటితో, “పలుమార్లు శ్రీలంక సైన్యుకులు నన్ను తుపాకీతో కాల్చిరి. అయితే ఆ తుపాకీ నుండి తూటాలు బయటికి రాలేదు. హెలికాప్టర్ ద్వారా నా యొక్క ఆలయముపై పెద్ద పెద్ద బాంబులను వేసిరి. బాంబులు కిందపడెను అయితే, అవి పేలకుండెను. శాశ్వతుడైన దేవుడు ఆశ్రయమైయుండెను’ అని చెప్పెను.
మనము జీవించుచున్న లోకము ఒక భయంకరమైన లోకము. ఏ సమయమునందు ఎట్టి ఆపద వచ్చును అనే సంగతిని పసిగట్టలేము. చిల్లంగి తనములు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, అంటువ్యాధులు, విపత్తులు చుట్టూత ఉంటూనే ఉన్నాయి. అయితే, మనము వాటికి భయపడనవసరము లేదు. శాశ్వతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు.
దావీదును చూడుడి! ఆయనకు ఎంతోమంది విరోధులు ఉండెను! గొర్రెలు పశువులను మేపుచున్నప్పుడు సింహములును, ఎలుకబంటులును, తోడేళ్లును ఆయనను ఎదుర్కొని వచ్చెను. దావీదు, ప్రభువు యొక్క ఆశ్రయమునందు ఉండినందున అవి ఏమియు ఆయనకు హాని కలిగించలేదు. దానికి బదులుగా, దావీదే వాటిని తరుముకుని వెళ్లి కొట్టి చంపి వేసెను.
ఆశ్రయము అను మాటకు కాపుదల అని అర్థము. ప్రభువు దావీదునకు ఉన్నతమైన ఆశ్రయముగా ఉండి సౌలు యొక్క వసమునుండి మాత్రము గాక, ఫిలిష్తీయులు, మిద్యానీయులు పలు రకములైన శత్రువుల నుండి ఆయనను కాపాడెను. తన యొక్క ఆశ్రయమునందు ఉంచుకొనెను.
క్రీస్తుని ఆశ్రయము యొక్క ఔన్నత్యమును మీరు తెలుసుకొన వద్దా? కోడి యొక్క రెక్కల క్రింద ఉన్న కోడి పిల్లలను చూడుడి. వాటికి ఎంతటి నెమ్మది! ఎంతటి ఆదరణ!
కోడి రెక్కల క్రింద నున్న పిల్లలు లోపల నుండి తలను పైకెత్తి సరదాగా చూచును. కాకులనుగూర్చి గాని, డేగలనుగూర్చి గాని, గ్రద్దలనుగూర్చి గాని అవి చింతించవు. ఎట్టి ఆపద వచ్చినను తమ యొక్క తల్లి తమ్మును తప్పించును అని అవి ఎరిగియున్నాయి.
దేవుని బిడ్డలారా, “మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును” (కీర్తనలు. 91:1-3).
నేటి ధ్యానమునకై: “జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి; ఆయన తన కంఠధ్వని వినిపించగా, భూమి కరగి పోవుచున్నది. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు; యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైయున్నాడు” (కీర్తనలు. 46:6,7).