జూన్ 16 – అయితే యేసు!
“ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను” (మత్తయి. 26:62).
యేసు మౌనమునే తన యొక్క జవాబుగా ఇచ్చుటను ఇక్కడ చూచుచున్నాము. యేసునకు విరోధముగా అనేకులు లేచి అబద్ధపు సాక్ష్యమును చెప్పుచు ఉండిరి. అయితే, ప్రధాన యాజకుని ఎదుట నిలబడియున్న యేసు తన యొక్క నీతి న్యాయములను గూర్చి ఎట్టి మాటైనను పలుకలేదు, ఆయన మాట్లాడక మౌనియైయుండెను.
మాట్లాడుటకు ఒక కాలము కలదు. మౌనముగా ఉండుటకు ఒక కాలము కలదు (ప్రసంగి. 3:7) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. యేసు అరణ్యమునందు నిలబడి ప్రభువు యొక్క మాటను ప్రసంగించెను. ప్రార్థన ఆలయములలో బోధించెను. ఆయన కొండ మీదకు ఎక్కి నిలబడినప్పుడు విస్తారమైన ప్రజలు ఆయన వద్దకు వచ్చియుండిరి. ఆయన తన నోరును తెరచి వారికి ప్రసంగించెను.
అయితే, వ్యభిచారమునందు పట్టబడిన స్త్రీని ఆయన ఎదుట నిలబెట్టి ఆమెపై అనేక నిరారోపణలు చేసినప్పుడు ఆయన మౌనముగా నేలపై వంగి ఏదో వ్రాయిచూ ఉండెను. వారు పట్టు విడవక మరలా మరలా ఆయనను అడిగినప్పుడే, ‘మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయిని వేయవలెను’ అని చెప్పి మరలా మౌనముగా ఉండి పోయెను. రాళ్లతో కొట్టుటకు వచ్చినవారు మెల్లగా తిరిగి వెళ్ళిపోయిరి.
మౌనము కొన్ని సమయములలో శక్తివంతమైన ఆయుధముగా పని చేయుచున్నది. మౌనమునందు అతిపెద్ద అంశములను సాధించువారు కూడాను కలరు. పేరుగాంచిన థామస్ హేంబిస్ అనువారు ‘క్రీస్తు నాధుని అనుసారము’ అను పుస్తకము యొక్క ముందుమాటలో ‘మౌనము నా స్నేహితుడు, ప్రార్ధన నా తోటివాడు’ అని వ్రాసెను. మరొక్క భక్తుడు: ‘మనుష్యుని వద్ద మాట్లాడుటను తగ్గించుకొనుడి; ప్రభువు వద్ద మాట్లాడుటను అత్యధికము చేయుడి’ అని చెప్పెను.
దావీదు రాజు యొక్క అనుభవము ఏమిటో తెలియునా? “నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని. నేను ఏమియు మాటలాడక మూగవాడినై మౌనినైతిని, క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని” అని సూచించుచున్నాడు (కీర్తనలు. 39:1,2). తద్వారా కలిగిన ఫలితము ఏమిటి? ఆ తరువాతి వచనము చెప్పుచున్నది: “నా గుండె నాలో మండుచుండెను; నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను; అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని” (కీర్తనలు. 39:3).
మనము మౌనముగా ఉన్నప్పుడు, ప్రభువు మన కొరకు మాట్లాడును. మన కొరకు వాదించి యుద్ధము చేయును. ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు, సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను” (యెషయా. 62:1).
దేవుని బిడ్డలారా, మీరు మీ కొరకు మాట్లాడినట్లయితే ప్రభువు మౌనముగా ఉండును. మీరు మౌనముగా ఉంటే ప్రభువు మీ కొరకు యుద్ధము చేయును. ప్రభువు మీ కొరకు యుద్ధము చేయుటకు చోటును ఇచ్చేదరా? ప్రభువు మీ యొక్క కార్యములన్నిటిని బాధ్యత వహించుచున్నాడు. ఆయన మీ కొరకు సమస్తమును చేసి ముగించును.
నేటి ధ్యానమునకై: “అయితే యెహోవా, తన పరిశుద్ధాలయములో ఉన్నాడు; ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక” (హబక్కూకు. 2:20).