మే 17 – విడిపించును!
“నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తనలు. 34:19).
ఎందుకని మనకు ఇన్ని ఆపదలు కలుగుచున్నవో అని మనము తలంచుచు ఉండవలసిన అవసరము లేదు. సాధారణమైన లోకస్తుని కంటే దేవుని యొక్క పిల్లలకు నిశ్చయముగానే అత్యధిక ఆపదలు కలదు, మనము లోక మార్గము చొప్పున, లోకస్తుల రీతి చొప్పున నడుచుకున్నట్లయితే లోకము మనలను ప్రేమించియుండును.
ప్రభువు కొరకు ప్రతిష్టతోను, సమర్పణతోను పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు ప్రయత్నించుచున్నప్పుడు, నిశ్చయముగానే లోకమును శరీరమును సాతానును మనలను ఎదిరించి నిలబడే తీరును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సద్భక్తితో బ్రదక నుద్దేశించు వారందరు హింసపొందుదురు” (2. తిమోతి. 3:12).
యేసుక్రీస్తు కూడాను సుఖ భోగమైన క్రైస్తవ జీవితమును మనము వెంబడించవలెను అని ఆదేశించలేదు. యేసు చెప్పెను: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను” (యోహాను. 16:33).
యేసుక్రీస్తు తనే ఉపద్రవాల మార్గములో నడిచి సిలువను మోసెను. “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను” (మత్తయి.;16:24) అని చెప్పెను.
శిష్యులు శ్రమల మార్గములోనే నడిచెను. ఒకవైపున యూదుల వలన ఉపద్రవము. మరోవైపున రోమా ప్రభుత్వము వలన ఉపద్రవము. అనేకులు హతసాక్షులుగా మరణించవలసిందిగా ఉండెను. అయినను ప్రాణమును లెక్కచేయక వారు ఉపద్రవాల మార్గములో నడిచి వెళ్లిరి.
లోకము వారికి యోగ్యమైనదిగా ఉండలేదు; వారు అడవులలోను, కొండలమీదను, గుహలలోను, భూమి లోని సొరంగములలోను చెదరగొట్టబడి తిరుగులాడుచు సంచరించిరి (హెబ్రీ. 11:28). ఎందుకు వారు ఆపదలను సహించిరి? బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి” (హెబ్రీ. 11:35).
క్రీస్తు నిమిత్తము వచ్చుచున్న ఆపదల మార్గములలో నడుచుచున్నవారికి ఒకవైపున ప్రభువు విడుదలను వాగ్దానము చేయుటతోపాటు, మరోవైపున దేవుని మహిమను కూడా వాగ్దానము చేసియున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తనలు. 34:19).
దానియేలు నీతిమంతుడిగా ఉండుట చేత ఎన్నో అసూయలను సంధించవలసినదై ఉండెను! సింహాల గృహలో వేయబడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడాను ప్రభువు తానే ఆయనతో నిలబడి ఆయనను విడిపించెను.
దేవుని బిడ్డలారా, అనేక ఉపద్రవముల ద్వారానే పరలోక రాజ్యములో మనము ప్రవేశింపగలము. ప్రస్తుత కాలపు శ్రమలు ఇక మన ఎదుట ప్రత్యక్షమగు మహిమకు పోల్చదగినది కాదు అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
నేటి ధ్యానమునకై: “అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను; అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను” (కీర్తనలు. 91:14).