ఆగస్టు 27 – ఒంటరిగా!
“(ఆయన) తండ్రికిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు” (యోహాను. 8:29).
“నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు, ఎన్నడును ఆయన నన్ను ఎడబాయనులేదు, నన్ను చేయి విడిచి పెట్టనులేదు. ఎల్లప్పుడును ఆయన యొక్క ప్రసన్నతయు, సన్నిధియు, శక్తియు, కృపయు నన్ను ఆదుకొనుచున్నది” అని చెప్పుట ఎంతటి ధన్యతగల అనుభవము!
ఒంటరితనము ఎల్లప్పుడును వేదనకరమైనది, అందులోను దేవుడు లేని ఒంటరితనము చాలా చాలా వేదనయు అపాయకరమైనది. ఒంటరితనముతో పీడించబడుచున్న వారిని పలు సమయములలో సాతాను వాడుకొనుచున్నాడు. సోమరితనమును, అలసటను, అధైర్యమును, అవిశ్వాసమును తీసుకొని వచ్చుచున్నాడు. ఒంటరితనముతో పీడించబడుచున్న వారి హృదయము సాతాను యొక్క కర్మాగారముగా మారిపోవుచున్నది. ప్రభువు మీ యొక్క ఒంటరితనమును మార్చి, తన యొక్క మహిమగల ప్రసన్నతచేత మిమ్ములను నింపుటకు కోరుచున్నాడు. మీ యొక్క గృహములోనికి వచ్చి సంచరించుటకు ఆయన కోరుచున్నాడు.
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ప్రభువు చూచి, తగినసాటియైన సహాయమును ఆదామునకు దయచేసెను (ఆది.కా. 2:18). అదే విధముగా ఆత్మీయ జీవితమునందును మీరు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనుటచేత విశ్వాసుల యొక్క సహవాసమును, సంఘ ఐక్యతను ఏర్పరచియున్నాడు. ఆత్మలో మీరు ఒంటరిగా ఉండకూడదు అనుట కొరకు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును పరిశుద్ధాత్ముని యొక్క నింపుదలను అనుగ్రహించియున్నాడు.
ఆనాడు అవ్వ భర్తను విడిచిపెట్టి ఒంటరిగా ఏధేను తోటలో సంచరించుచు ఉండినందున, అట్టి ఒంటరితనమును సాతాను ఉపయోగించుకుని ఆమెను వంచించి ఏమార్చివేసెను. అదేవిధముగా యెరికో తట్టునకు ఒంటరిగా నడిచి వెళ్ళుచున్న బాటసారిని దొంగలు గాయపరచి కొన ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. వంటరితనము అపాయకరమైనది.
భర్తతో బహు సంతోషముగా జీవించి, అకస్మాత్తుగా భర్త మరణించగా, ఒక స్త్రీ వైద్యమునందు ఒంటరిగా నిలబడుచున్నప్పుడు అట్టి స్త్రీ యొక్క దుఃఖము ఎంతటి ఘోరమైనది! పిల్లలను ఎడబాసి జీవించు తల్లిదండ్రులు, పిల్లల యొక్క తలంపుతోను, తపనతోను ఉంటున్నారు. కడలిలో ఒంటరిగా పడవలో పయణించుచున్న ఒకరు త్రోవ తెలియక అలమటించుచున్నప్పుడు ఒంటరితనమును తలంచి విలపించును కదా? దావీదు ఒక దినమున ఒంటరితనము యొక్క వేదనలో, వెనక వచ్చునట్లు విలపించెను: “రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను” (కీర్తనలు. 102:7).
మీరు కూడాను బహుశా ఇటువంటి ఒంటరితనపు బాటలో వెళ్ళచ్చును. నేడు ప్రభువును తోడుగా ఆహ్వానించుడి. నన్ను పంపినవాడు నాతో కూడా ఉన్నాడు. “(ఆయన) తండ్రికిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు” (యోహాను. 8:29) అని విశ్వాసపు ఒప్పుకోలు చేయుడి. ఏది చేసినను ఇది ప్రభువునకు ప్రీతికరముగా ఉన్నదా, ఆయన నా పట్ల మనస్సునందు సంతోషించున్నాడా అను సంగతిని ఆలోచించి పరిశీలించి చూచుకొనుడి.
దేవుని బిడ్డలారా, ప్రభువునకు ప్రీతికరమైన వాటినే ఎల్లప్పుడును చేయుటకు మిమ్ములను సమర్పించుకొనుడి.
నేటి ధ్యానమునకై: “పగటివేళ మేఘస్తంభమునైనను, రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యెదుట నుండి తొలగింపలేదు” (నిర్గమ. 13:22).