Appam, Appam - Telugu

జూన్ 21 – నిష్కళంకులు!

“ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను (నిందారహితులు) లోపము లేనివారిగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి” (2. పేతురు. 3:14).

లోకము యొక్క అంతమునకును, ప్రభువు యొక్క రాకడకును మనము సమీపించియున్నాము. రాకడ సమీపముగా ఉన్నది అని ఎరిగియుంటే మాత్రము సరిపోదు. మనము దాని కొరకు సిద్ధపడవలసినది మిగుల అవశ్యము. ఈ విషయమై పేతురు కొన్ని ఆలోచనలను ఇచ్చుచున్నాడు.

మొదటిది, మనము నిష్కళంకులుగా ఉండవలెను. మన యొక్క ఆత్మీయ జీవితము అను రక్షణ వస్త్రమునందు లోకము, శరీరము, సాతాను మొదలగు మూడును కళంకమును ఏర్పరచుటకు ప్రయత్నము చేయుచున్నాయి. ప్రభువు యొక్క పెండ్లి కుమార్తెగా నిర్మలమైన వస్త్రమును ధరించి పరిశుద్ధముగా ఉండవలసిన మనము, లోకము వలన కళంకము పరచబడకుండునట్లు మనలను కాపాడుకొనుట అవశ్యము. యేసుని రక్తము చేత మన యొక్క అంగీలను మనము పరిశుద్ధముగా ఉతుకొని ఉండవలసినది ఆవశ్యము.

మన యొక్క ప్రాణమును మలిన పరిచేటువంటి సంబంధములు, పవిత్రతను అపవిత్రపరిచేటువంటి సంభాషణలు, మనస్సాక్షిపై నేరారోపణ చేయు క్రియలు మొదలగు వాటిని విడిచిపెట్టి ప్రార్థనయందును, లేఖనము చదువుటయందును, దేవుని బిడ్డల యొక్క సహవాసమునందును మనము నిలచి నిలకడగా ఉండవలెను. లోకమును ప్రేమించుటకు కోరువాడు దేవునికి విరోధియైయున్నాడు. అందుచేతనే అపో. యోహాను: “నా పిల్లలారా, లోకమును లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి” అని చెప్పుచున్నాడు.

అంత మాత్రమే కాదు, లోపము లేనివారిగాను మనము నడుచుకొనవలెను. లోపము అనగా ఏమిటి? దేవుని యొక్క కొలబద్దకును, అంచనాకును లోపము కలిగి జీవించుటయే లోపము. లేఖన వాక్యమునకు విరోధమైన ప్రతి ఒక్క అంశమును లోపమే. చిన్నపిల్లలు తమ పాఠములను వ్రాయుచున్నప్పుడు లోపములతో వ్రాయునట్లయితే మరల వారు అదే తప్పును చేయకూడదు అనుట కొరకు, బెత్తముతో కొట్టి సరిదిద్దుచున్నాము.

ప్రభువు కూడాను మన వద్ద లోపమును కనుగొనుచున్నప్పుడు శిక్షలను పంపించుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును …. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?” అని ఆయన అడుగుచున్నాడు (హెబ్రీ. 12:6,7).

మూడోది, శాంతముగలవారై మన యొక్క తలంపులలో కనబడవలెను అని పేతురు చెప్పుచున్నాడు. మనము రక్షింపబడుచున్నప్పుడు దేవుని యొక్క శాంతిని పొందుకొనుచున్నాము (రోమీ. 5:1). అంతటితో ఆగిపోకూడదు మన యొక్క జీవితమునందు ఎంతటి తుఫాను వీచినను, పెనుగాలులు వీచినను, సముద్రము ఉప్పొంగినను ప్రభువును పరిపూర్ణముగా ఆనుకొని పొందుకొనిన శాంతిని కాపాడుకొనవలెను.

దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథము చెప్పుచున్నట్లు మనము నిష్కలంకులుగాను, ఎట్టి లోపము లేనివారిగాను, శాంతముగలవారై కనబడుదుము గాక!

నేటి ధ్యానమునకై: “ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి” (1. యోహాను. 2:28).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.