జూన్ 02 – ఎఱ్ఱని దారము!
“నీవు ….. ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రియింటి వారినందరిని నీయింట చేర్చుకొనుము” (యెహోషువ. 2:18).
రాహాబు అను స్త్రీ యొక్క కుటుంబమునంతటిని నాశనము నుండి కాపాడిన ఇశ్రాయేలీయులు వారికి చెప్పిన ఆలోచన కలదు. “నీ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టియుంచుము” అనుటయే అది. అది ఒక ఆనవాలు. రాహాబు యొక్క కుటుంబ సభ్యులు అందరును ఎరికో యొక్క నాశనము నుండి కాపాడదగిన ఒడంబడిక యొక్క ఆనవాలు.
రాహావు వేశ్యయై ఉండినప్పటికిని, పాపపు జీవితమునందు సంపాదించుచున్నదై ఉండినప్పటికిని ఆమెకు ప్రభువును గూర్చిన ఒక దర్శనము ఉండెను. ఆమె చెప్పెను: “యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టెననియు, మీ భయము వలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడెననియు నేనెరుగుదును. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే” (యెహోషువ. 2:9,11).
రాహాబు కట్టి ఉంచియున్న ఎఱ్ఱని దారము, యేసు క్రీస్తు యొక్క రక్తమును సూచించుచున్నది. ఆయన రక్తమే మనలను సర్వోన్నతుని చాటున, సర్వశక్తుని నీడలో కాపాడుటకు శక్తి గలదిగా ఉన్నది. ఆయన రక్తమే, దుర్గముగా నిలబడి, ప్రాకారముగా ఆవరించి, మనలను దాచుచున్నది. “యేసుక్రీస్తుని రక్తమే జయము” అని మరలా మరలా చెప్పుచున్నప్పుడు, క్రీస్తు యొక్క కాపుదలలో మనము ఉన్నాము అను విశ్వాసము మనలో ఏర్పడుచున్నది.
ఐగుప్తు దేశమంతటా సంహారపు దూత బయలుదేరి వచ్చినప్పుడు, ఏయే ఇంట గొర్రె పిల్ల రక్తము యొక్క ఆనవాలును చూచెనో, ఆ యా ఇండ్లను విడిచి పెట్టి వెళ్లెను. ఏ యే ఇంట ఆ రక్తము యొక్క ఆనవాలు లేదో, ఏ యే ఇంటి యొక్క గుమ్మపు కమ్ములకు ఆ రక్తము రాయబడలేదో, ఆ యా ఇండ్లలో సంహారము చేసెను. తొలిచూలు పిల్లలు మరణించిరి. మృగములును, జీవరాసులును మరణించెను (నిర్గమ. 12:22,23). కావున మనము ఎల్లప్పుడును మనలను క్రీస్తు యొక్క రక్తములో మరుగుపరచుకొనవలెను.
అపో. పేతురు తన యొక్క పత్రికను వ్రాయుచున్నప్పుడు: “తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి, ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది” అని వ్రాయుచున్నాడు (1. పేతురు. 1:1,2). ఎవరెవరిపై క్రీస్తు యొక్క రక్తపు ముద్ర ఉన్నదో, వారిని లోకమును, శరీరమును, సాతానును మొట్టనే మొట్టవు. సాతాను విసురుచున్న ఎట్టి అగ్ని హస్త్రములును వారిని సమీపించనే లేవు.
మనము సిలువ చెంతకు వచ్చుచున్నప్పుడు, “మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు” (హెబ్రీ. 12:24). అట్టి రక్తము ద్వారా మన యొక్క పాపములు కడుగబడియున్నది. అతిక్రమములు క్షమింపబడియున్నవి. శాపము యొక్క వెన్నెముక విరవబడియున్నది. వ్యాధులు తొలగించబడున్నది. సాతాను యొక్క శిరస్సు చితక కొట్టబడియున్నది. అంత మాత్రమే కాదు, మన యొక్క ప్రాణము తప్పించబడుచున్నది.
నేటి ధ్యానమునకై: “గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు” (ప్రకటన. 12:11).