Appam, Appam - Telugu

మే 15 – బలపరిచేటువంటి తోడు!”

“నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను” (2. తిమోతి. 4:17).

‘ప్రభువు నా ప్రక్క నిలిచి’ అని అపో. పౌలు చెప్పుటను చూడుడి. ప్రభువు మనకు తోడుగా ఉండినట్లయితే, అనేక అంశములను మనము ప్రభువు కొరకు చేయగలము. యాకోబు యోసేపును ఆశీర్వదించుచున్నప్పుడు: “ఆయనే. నీకు సహాయము చేయును; …. పైనుండి మింటి దీవెనలతోను, క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను, ….నిన్ను దీవించును” (ఆది. కా. 48:25) అని చెప్పెను.

అవును, ప్రభువు మనకు తోడుగా నిలబడుచున్నప్పుడు ఎల్లప్పుడును ఆశీర్వాదమును, విజయమును, సంతోషమును నిలచియుండును. ఇక్కడ అపో. పౌలు ప్రభువు తనకు తోడుగా నిలబడి తనను బలపరచునట్లుగా చెప్పుచున్నాడు.

అన్యజనులందరికిని, రాజులందరికిని, ఇశ్రాయేలీయులందరికిని సువార్త ప్రకటించుటకును, ప్రసంగించుటకును దేవుని చేత ఎన్నుకొన్నబడిన పాత్రయే అపో. పౌలు. ఆయన సంఘము యొక్క ఎదుగుదల నిమిత్తము బైబిలు గ్రంథమునందు 14 పత్రికలను వ్రాయునట్లుగా దేవునిచే ఎన్నుకోబడిన ఒక దైవజనుడు‌‌ దేవుని యొక్క మర్మముల గృహనిర్వాహకుడు అని పిలువబడినవాడు.

ఆయన పలు సంఘములను స్థాపించుటకును, పట్టణములలో ఉజ్జీవమును కలిగించుటకు కారకుడైనవాడు. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అనియు, “నన్ను బలపరచుచున్న క్రీస్తునియందే నేను సమస్తమును చేయుటకు నాకు బలముకలదు” (ఫిలిప్పీ. 4:13) అనియు ఆయన ఒప్పుకోలు చేయుచున్నాడు.

ప్రభుత్వమునందు పని చేయుచున్న మా యొక్క తండ్రిగారిని సంపూర్ణ సేవ కొరకు పిలిచినప్పుడు, ఆయన తన వద్ద శక్తియేగాని, సామర్థ్యమేగాని, బలమేగాని ఏమీ లేనివాడిగా గ్రహించెను. బైబిలు గ్రంథమును వివరించి జనులకు చెప్పుటకు కావాల్సిన జ్ఞానమే గాని, బైబులు యొక్క విజ్ఞానమే గాని తనకు లేదని తలంచెను.

ఏ విషయమందైనను అర్హత లేని ఆయనను ప్రభువు పిలచి, నీవు నా ప్రజలకు ఆత్మీయ ఆహారము ఇవ్వబోవుచున్నావు. అనుదిన మన్నాను అందించబోవుచున్నావు అని చెప్పినప్పుడు మా తండ్రిగారు ఆశ్చర్యపడి కలతచెందెను. అయితే ప్రభువు ఆయనకు ప్రక్క నిలచి, సువార్తను లోకమంతట గల పలు దేశములకు తీసుకొని వెళ్ళుటకు ఆయనను బలపరచెను. అంత మాత్రమే కాదు, వందల కొలది పుస్తకములను రచించుటకును, ప్రతి మాసమును అనుదిన మన్నా సందేశమును ఆవిష్కరించుటకు ప్రభువు తానే సహాయము చేసెను.

“నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడైయున్నాడు; నాతో వ్యాజ్యెమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ఇదిగో, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును” (యెషయా. 50:8,9) అని యెషయా ప్రవక్త చెప్పుచున్నాడు.

కీర్తనకారుడు చెప్పుచున్నాడు: “నీవు నాకు సహాయకుడవై యుంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. ….. నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. (కీర్తనలు. 63:7,8). దేవుని బిడ్డలారా, ప్రభువు ఎల్లప్పుడును మీకు తోడుగా నిలబడుచున్నాడు భయపడకుడి.

నేటి ధ్యానమునకై: “మీరు ధైర్యము వహించుడి, పనిని జరిపించుడి మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును” (2. దినవృ.19:11).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.