Appam, Appam - Telugu

సెప్టెంబర్ 17 మహిమగా ఉండును!

“యెహోవాయే నీకు నిత్యమైన వెలుగా ఉండును, నీ దేవుడు నీకు (భూషణము) మహిమగా ఉండును” (యెషయా. 60:19).

ప్రవక్తయైన యెషయా గ్రంథమునందు గల 60. ‘వ అధ్యాయము బహు శ్రేష్టమైనదియు, లోతైనదియునైన ఒక అధ్యాయము. అది దేవుని యొక్క మహిమను గూర్చి మాట్లాడుచున్న ఒక అధ్యాయము. ఆ అధ్యాయము, “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము; యెహోవా మహిమ నీమీద ఉదయించెను” అని ప్రారంభించుచున్నది. ప్రభువు నిమిత్తము ఎవరెవరు లేచి ప్రకాశించుచున్నారో, అట్టి వారికి ప్రభువే నిత్యమైన వెలుగుగాను, మహిమగాను ఉండును (యెషయా. 60:19).

క్రైస్తవ జీవితము యొక్క మొదటి అనుభవము, మహిమను చూచుచున్న అనుభమైయున్నది. మోషే, దేవుని యొక్క మహిమను చూచుటకు వాన్ఛించి, బండ సందులో దాగియుండి ప్రభువు యొక్క మహిమను చూచెను. దావీదు కూడాను దేవుని మహిమను చూచుటకు కోరెను : (కీర్తనలు. 27: 4). “నీ బలమును నీ (ప్రభావము) మహిమను చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను” (కీర్తనలు. 63: 2) అని ఆయన చెపుచున్నాడు.

రెండవ అనుభవము, మహిమను ప్రతిభంబించు అనుభవము. సినాయి కొండమీద నలభై దినములు దేవుని సముఖములో ప్రభువు ఎదుట మోషే నిలబడినప్పుడు. ఆయనకు తెలియకుండానే ఆయన ముఖము ప్రకాశించెను. అవును, దేవుని సముఖములో రాత్రింపగళ్ళు కనిపెట్టుకొనియున్న వారియొక్క ముఖము ప్రకాశించే తీరును. వారి జీవితము కూడాను ప్రకాశించే తీరును. మహిమను ప్రతిభంబించు అనుభవము మిగుల శ్రేష్టమైనది.

మూడవ అనుభవము, మహిమగల అభిషేకము చేత నింపబడుచున్న అనుభమైయున్నది. పరిశుద్ధ ఆత్ముడు మహిమగల ఆత్మడు అని పిలవబడుచున్నాడు (1. పేతురు. 4:14). పరిశుద్ధ ఆత్ముని అభిషేకమును పొందుచున్నప్పుడు మహిమగల దేవుడు మనలోనికి వచ్చి నివాసము చేయును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి; మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి” (కీర్తనలు. 24:7).

మహిమగల అభిషేకము చేత నింపబడుచున్న అనుభవముతో ఒక వ్యక్తి ఆగిపోకూడదు. పొందుకొనిన మహిమతో పాటు లేచి ప్రకాశించవలెను. దీనిని ప్రవక్తయైన యెషయా : “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము; యెహోవా మహిమ నీమీద ఉదయించెను” (యెషయా. 60:1) అని చెప్పుచున్నాడు.

మీరు చీకటియైన లోకములో జీవించుచున్నారు. ప్రభువు మిమ్ములను లోకమునకు వెలుగుగా మాత్రము గాక, మహిమగాను ఉంచియున్నాడు. లేచి ప్రకాశింపవలసినది మీ యొక్క బాధ్యత. “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది; అయినను యెహోవా నీమీద ఉదయించుచున్నాడు; ఆయన మహిమ నీమీద కనబడుచున్నది” (యెషయా. 60:2).

దేవుని బిడ్డలారా, మీరు ఆ తర్వాతి అనుభవములోనికి దాటి రండి. ప్రభువు యొక్క రాకడలో మీరు మహిమనుండి అత్యధిక మహిమను పొందవలెను. క్రీస్తునకు సమానమైన రూపాంతరమును పొందవలెను. మహిమగల దేశములో మహిమగల రాజైయున్న క్రీస్తుతోపాటు నిరంతరమును ఆనందించవలెను. అవును, అట్టి దినము సమీపముగా ఉన్నది.

నేటి ధ్యానమునకై: “మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము” (2. కోరింథీ. 3:18).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.