మే 24 – తప్పించును, విడిపించును!
“మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును విడిపించును” (దాని. 3:17).
ప్రభువు మనలను త్రోవ నడిపించుటతోపాటు, తప్పించును, విడిపించును. అది షద్రకు, మేషాకు, అబేద్నెగోల యొక్క విశ్వాసపు ఒప్పుకోలు మాత్రము గాక, దృఢమైన సాక్ష్యముగాను అమర్చబడెను. ఒక వైపున రాజు యొక్క కోపము నుండి తప్పించెను. మరోవైపున బలవంతులను సహితము దహించి వేసిన అతి భయంకరమైన అగ్నిగుండములో నుండి విడిపించెను.
నేడు ప్రభువు మిమ్ములను ఎందులో నుండి విడిపించవలెను? అతి భయంకరమైన అప్పుల సమస్యనుండియా? నిందల అవమానములనుండియా? రోగ శయమునుండియా? క్రూరుల యొక్క హింసలనుండియా? తరతరములుగా సంక్రమించుచున్న శాపములనుండియా? ఎందులో నుండి మీకు విడుదల కావలెను? ఏదైనప్పటికిని ప్రభువు విడుదలను ఇచ్చుటకు సమర్ధుడైయున్నాడు. ఆయన మిమ్ములను విడిపించి తప్పించును!
“కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు” (యోహాను. 8:36). “సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” (యోహాను. 8:32). “ప్రభువే ఆత్మ; ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును” (2. కోరింథీ. 3:17) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
దారిద్రత నుండి విడుదల కావలెనా? క్రింద ఉన్న వచనమును చదివి విశ్వాసపు ఒప్పుకోలును చేయుడి. “ఆయన ధనవంతుడై యుండియు, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను” (2. కొరింథీ. 8:9).
రోగము నుండి విడుదల కావలెనా? ఈ వాక్యములను విశ్వాసపు ఒప్పుకోలుగా మరల మరల చెప్పుడి. నిజముగానే ఆయన నా యొక్క బలహీనతలను వహించి రోగములన్నిటిని భరించెను. ఆయన పొందిన దెబ్బల చేత నిశ్చయముగానే స్వస్థతను పొందితిని (మత్తయి. 8:7; యెషయా. 53:5; 1. పేతురు. 2:24).
శాపము నుండి విడుదల కావలెనా? ద్వితీ. 23:5; గలతి. 3:13; ప్రకటన. 22:3 మొదలగు వచనములను చదివి ఒప్పుకోలుగా చెప్పుడి. క్రీస్తు మన కొరకు శాపమై, ధర్మశాస్త్రము యొక్క శాపములన్నిటిలో నుండి మనలను విడిపించి విమోచించెను. ఆయన మనలను ప్రేమించుట చేత అట్టి శాపమును ఆశీర్వాదముగా మార్చుటకు సంకల్పించెను. పాపపు జీవితము నుండి మీకు విడుదల కావలెనా? కల్వరి సిలువను తేరి చూడుడి. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసుకొనెను (1. పేతురు. 2:24) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
‘దేవా నేను సాహసించి తెగించి చేసిన పాపముల వలన నేను నిన్ను దుఃఖ పరిచియున్నానేమో? నా దోషములే కదా, మేకులుగా మారి నీయొక్క శరీరమును గుచ్చి వేసెను కదా? నేను తెగించి సాహసించి చేసిన పాపములే కదా కొరడాలుగా మారి నిన్ను వేదనపరిచెను కదా ? నా పాపమును క్షమించి, పాపక్షమాపణ నిశ్చయతను, రక్షణ సంతోషమును దయచేయుము’ అని కన్నీటితో అడుగుడి. దేవుని బిడ్డలారా, ఆయన పాపపు అలవాటులో నుండి మిమ్ములను నిశ్చయముగా విడిపించి తప్పించును!
నేటి ధ్యానమునకై: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1. యోహాను. 1:9).