జూలై 25 – ధైర్యమును పెంపొందించుట కొరకు!
“ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని, యెహోవా నాకు ఉత్తరమిచ్చి విశాలస్థలమునందు ఉంచెను” (కీర్తనలు. 118:5).
ప్రార్ధన మీయొక్క ఇరుకులను, పోరాటములను తొలగించుచున్నది. విశాలమైన స్థలమునందును, ఉన్నతమైన స్థలమునందును కూర్చుండునట్లు చేయుచున్నది. ప్రార్ధించువారు పైపైకి హెచ్చింపబడుదురు. “నీతిమంతులైయితే సింహమువలె ధైర్యముగానుందురు” (సామెతలు. 28:1) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
మన ప్రభువు పిరికివాడు కాదు, ధైర్యముగల దేవుడు. ఆయన ప్రార్ధించుచున్న తన యొక్క పిల్లలను ధైర్యపరచి నిబ్బరపరచువాడు. యెహోషువాను మోషే ద్వారా నిబ్బరపరిచెను. దానియేలును, ఏలియను దేవదూతల ద్వారా నిబ్బరపరచెను. శిష్యులను తన యొక్క గాయమునొందిన హస్తము ద్వారా నిర్భరపరచి బలపరచెను.
సాతాను విశ్వాసులను పాపము చేయుటకు పురిగొలుపుచున్నాడు. పాపము, ఆత్మీయ ధైర్యమును కోల్పోవునట్లు చేయుచున్నది. కానీ పరిశుద్ధాత్ముడైయితే, విశ్వాసులను ప్రార్థన చేయుటకు ప్రేరేపించి రేపుచున్నాడు. ప్రార్థన మహా గొప్ప ధైర్యమును, ఉన్నత బలమును, ప్రభువు కొరకు వైరాగ్యతను తీసుకొని వచ్చును. జయముపై జయమును పొందునట్లు చేయుచున్నది.
పౌలు దేవుణ్ణి స్తోత్రించి, ధైర్యమును తెచ్చుకొనెను. (అపో.కా. 28:15) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. ప్రార్థించి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ధైర్యమును తెచ్చుకొనిన పౌలు మిగుల ధైర్యముతో నిరాటంకముగా దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించి, ప్రభువైన యేసుక్రీస్తుని సువార్తలను బోధించుచుండెను.
యెరూషలేమునందు గల మేడ గదిలో పది దినములును ఉపవాసముండి ప్రార్ధించుచు వచ్చిన పేతురును, శిష్యులును ప్రభువు కొరకు వైరాగ్యమును కలిగియుండెను. యూదులకును, పరిసయ్యులకును భయపడలేదు. ధైర్యముగా నిలబడి క్రీస్తును ప్రసంగించిరి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “వారు పేతురును యోహానుల ధైర్యమును చూచినప్పుడు, వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తించిరి” (అపో.కా. 4:13).
మీరు ఆసక్తితో ప్రార్థించెదరా? అప్పుడు మీరు మనుష్యులకు భయపడనవసరము లేదు. రక్షక నిలయము అనియు, న్యాయస్థానము అనియు అలయుచూ, తిరుగుతూ చేతులు కట్టుకొని నిలబడవలసిన అవసరము లేదు. మీ మనస్సాక్షి స్పష్టముగా ఉండును. మీ మాటలను ప్రభువు ఘనపరచును. ఎవరును ఎదిరించి నిలబడలేని వాక్కుచేతను, శక్తిచేతను ప్రభువు మిమ్ములను నింపును.
సాధారణమైన ప్రార్థనలో “మమ్మును శోధనలోకి తేక, దుష్టుని నుండి మమ్మును రక్షించుము, రాజ్యమును శక్తియును, మహిమయు నీదైయున్నది, ఆమెన్” (మత్తయి. 6:13) అని ప్రార్ధించునట్లుగా ప్రభువు బోధించెను. దేవుని బిడ్డలారా, సమస్త కీడులనుండి మిమ్ములను తప్పించి కాపాడును. ఓర్వలేని సమస్త కన్నులనుండియు, అసూయగల కన్నులనుండియు, చెడు దృష్టినుండియు సంపూర్ణముగా మిమ్ములను తప్పించి కాపాడును.
నేటి ధ్యానమునకై: “మీరు దేనిని గూర్చియు చింతపడకుడి గాని, ప్రతి విషయము గూర్చి మీ విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్ధనద్వారాను విన్నపముద్వారాను దేవునికి తెలియజేయుడి” (ఫిలిప్పీ. 4:6).