Appam, Appam - Telugu

జూలై 02 – మనుష్యుని యొక్క స్వరము!

“అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చెను” (1. రాజులు. 12:13).

రాజైన సొలొమోను మరణించిన తర్వాత, ప్రజలు ఆయన కుమారుడైన రెహొబాము నొద్దకు వచ్చి: “నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠిన దాసత్వమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక పరచిన యెడల మేము నీకు సేవచేయుదుము.” అని మనవిచేసిరి (1. రాజులు. 12:4).

అయితే, రెహొబాము పెద్దల ఆలోచనను నిర్లక్ష్యముచేసి, దానికి బదులుగా తనతోపాటు పెరిగిన అనుభవము లేని యవ్వనుల ఆలోచనను ఆలకించెను. ఆయన ప్రజలకు కఠినమైన సమాధానమును ఇచ్చుట వలన, ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రములలో పది గోత్రములు ఆయనపై తిరుగుబాటు చేసి, ఆయన యొద్ద నుండి విడిపోయిరి. శరీరానుసారమైన ఆలోచనలు తరచుగా విభజనకును, వినాశనమునకును దారితీయును.

దేవుని సేవకులు ప్రార్థించి, జ్ఞానయుక్తమైన ఆలోచనను అందిచెదరు. దైవభయము గల తల్లిదండ్రులు తమ పిల్లలకు జయ జీవితపు రహస్యాలను బోధించెదరు. కావున, దేవుని పిల్లలు మంచి సలహాలను ఆలకించి, వాటి ప్రకారము నడుచుకొనవలెను. ఆత్మీయ వివేచన ద్వారా, వారు సరైన మార్గాన్ని గుర్తించడమును నేర్చుకొనవలెను.

కొన్ని సమయములలో, మనుష్యుల యొక్క స్వరములు ఒకరితో ఒకరికి విన్నభిప్రాయమును తెచ్చును. అబ్రాహాము జీవితాన్ని గమనించి చూడుడి. ఇస్సాకు జన్మించిన తర్వాత, ఇష్మాయేలు అతనిని హేళన చేయడమును శారా చూచి: “ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడైయుండడని అబ్రాహాముతో అనెను” (ఆదికాండము 21:10).

ఇష్మాయేలు తన కుమారుడైయున్నందున ఈ మాట అబ్రాహామునకు ఎంతో బాధను కలిగించెను. ఒకవైపు శారా స్వరము; మరొవైపు తన జ్యేష్ఠ కుమారునిపై ఒక తండ్రికి ఉండేటువంటి ప్రేమపూర్వకమైన స్వరము. అబ్రాహాము ఇష్మాయేలును ప్రేమించెను, కాబట్టి అతనిని పంపించివేయడము అతనికి ఎంతో వేదనతో కూడినదైయుండెను. ఎటువంటి నిర్ణయము తీసుకొనవలెను, ఎవరి మాట వినవలెను అని పాలుపోక, అబ్రాహాము దేవుని సన్నిధికి వెళ్లెను. అప్పుడు ప్రభువు: “శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె

స్వరమును వినుము” అని చెప్పినప్పుడు, ఆయన లోబడి హాగరును, ఇష్మాయేలును పంపివేసెను.

అదే సమయములో, ఒక్కడు తన జీవిత భాగస్వామి ఇచ్చే ప్రతి సలహాను గుడ్డిగా అనుసరించలేని సందర్భాలు కూడా ఉంటాయి. యోబు యొక్క శ్రమలకాలములో, ఆయన భార్య అతనితో: “నీవు ఇంకను నీ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము!” అనెను (యోబు 2:9). యోబు అటువంటి మాటలను ఎలా వినగలడు? దానికి బదులుగా ఆమెను యోబు గద్దించెను.

దేవుని బిడ్డలారా, ఏ నిర్ణయమును తీసుకనవలెనో తెలియక మీరు సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభువు సన్నిధికి వెళ్లుడి. ప్రభువు యొక్క ఆలోచనను వినడానికి ప్రార్థనపూర్వకముగా కనిపెట్టుడి. ఆయన మీకు బోధించి, మీరు నడువవలసిన మార్గమును మీకు చూపించును.

నేటి ధ్యానమునకై: “నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని,నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును” (ద్వితి. 28:2,1).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.