Appam, Appam - Telugu

అక్టోబరు 04 – వెదికేటువంటి సమయము!

“నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి; ప్రేమయను కోత మీరు కోయుడి; యెహోవాను వెదుకుటకు ఇదే సమయము; గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతి వర్షము కురిపించునట్లు, ఇదివరకెన్నడును దున్నని బీడు భూమిని దున్నుడి” (హోషేయా. 10:12).

పైన చెప్పబడియున్న వచనములో ప్రవక్తయైన హోషేయా: ‘ఇది పగటి కాలము మాత్రము కాదు, ప్రభువును వెదికేటువంటి సమయమునైయున్నది’ అని సూచించుచున్నాడు. ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను వెదకుడి. ఉపవాసముతోను, ప్రార్థనతోను వెదకుడి. “వెదకుడి అప్పుడు మీకు దొరకును; వెదకువానికి దొరుకును” (మత్తయి. 7:7,8) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. ఈ వచనము యొక్క మరికొన్ని భాషాంత్రములలో ప్రభువును వెదుకుచూనే ఉండుడి. అప్పుడు దొరుకును అని చెప్పుచున్నది.

షూలమతి చెప్పుచున్నది: “రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని; వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని” (ప.గీ. 3:1,2) చివరకు నా ప్రాణప్రియుడు నాకెదురు పడినప్పుడు, “వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని” (ప.గీ. 3:4).

ప్రతి దినమును ప్రార్ధన సమయములో ప్రభువు యొక్క ముఖమును వెదకుడి. ఆయన మీతో ఏమని మాట్లాడనో అని తెలుసుకొనుటకు ఆసక్తితో ఉండుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మీరు యెహోవా పక్షపువారైన యెడల ఆయన మీ పక్షముననుండును; మీరు ఆయనను వెదికిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించిన యెడల, ఆయన మిమ్మును విసర్జించును” (2. దినవృ. 15:2).

ఒకవైపున మనము ఆయనను వెదుకుచున్నాము, మరోవైపున ఆయన కూడాను మనలను వెదకుచున్నాడు. ఆయన మిక్కిలి ప్రేమతోను వాత్సల్యముతోను మనలను వెదుకుటకై పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చెను. రాళ్లగుట్టలలోను, ముళ్లపొదల్లోను నడచి ఆయన మనలను వెదకుచున్నాడు. మనలను వెదకుచున్న ప్రేమ కొరకే లూకా. 15 ‘వ అధ్యాయమును ఆయన వ్రాసి పెట్టెను.

తప్పిపోయిన గొర్రెను వెదకి కనుగొనుచున్న మంచి కాపరి యొక్క ఉపమానమును, కనబడకుండా పోయిన వెండి నాణమును వెదకి కనుగొనుచున్న స్త్రీ యొక్క ఉపమానమును, ఇంటిని విడిచి వెళ్లిపోయిన చెడ్డ కుమారుని వెదకి ఆశతో ఎదురు చూచుచున్న తండ్రి యొక్క ఉపమానమును ఇందులో మనము చదువుచున్నాము.

మిమ్ములను వెదకుచున్న ప్రభువును మీరు కూడాను వెదకవలెను. మిమ్ములను ప్రేమించుచున్న ప్రభువును మీరు కూడాను ప్రేమించవలెను. ఇది ప్రభువును ఆసక్తితో వెదికేటువంటి ఒక కాలముగా ఉన్నది.

చూడండి, చీమలు కాలమును సద్వినియోగ పరుచుకొనుచు ఎరను వెదకవలసిన కాలములో ఎరను వెదకి తన ఆహారమును వర్షాకాలమునకు ముందుగా సిద్ధపరచి పెట్టుకొనుచున్నాయి. ఇందువలన అవి చింతలేకుండా సంతోషముగా వర్షాకాలమును ఎదుర్కొనగలదు.

కావున, వచనము దొరకని కరువు కాలము వచ్చుటకు ముందుగా ఆత్మయు, జీవమునైయున్న ప్రభువు యొక్క వచనములను చదివి ధ్యానించుడి. మంచి ఆత్మీయ సాహిత్యములను చదివి లబ్ధిపొందుడి. అవును, ఇది ప్రభువును, ఆయన యొక్క మాటలను వెదకవలసిన ఒక కాలము.

నేటి ధ్యానమునకై: “వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు” (సామెతలు. 10:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.