జూలై 20 – “సన్మానింపుము!
“నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” (నిర్గమ. 20:12)
ధర్మశాస్త్రమునందు పది ఆజ్ఞలు ఉండినప్పటికీని, అందులో ఒకే ఒక్క ఆజ్ఞ మాత్రమే వాగ్దానముతో జతపరచ బడినదైయున్నది. నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించినట్లయితే, నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు అను వాగ్దానమును ప్రభువు దయచేయుచున్నాడు. ఇక్కడ ఆజ్ఞతో పాటు ఆశీర్వాదకరమైన వాగ్దానము జతపరచియుండుటను చూడుడి.
కొందరు, నా తల్లి నాకు ద్రోహము చేసెను. నా తండ్రి నన్ను బహుగా హింసించేవాడు అని తల్లిదండ్రులపై నేరమును మోపుచు సణుగుచు ఉండ వచ్చును. అయితే, మీరు ఎరుగని శిశుప్రాయమునందు ఉన్నప్పుడు, తల్లి తన యొక్క రక్తమునే క్షీరముగా చేసి త్రాగించిన సంగతిని, తండ్రి శ్రమపడి సంపాదించి, మిమ్ములను పెంచిన సంగతిని అట్టివారు తలంచి చూడవలెను. ప్రభువు బైబిలు గ్రంధమునందు అనుగ్రహించిన కట్టడలకు లోబడి వారిని సన్మానించుడి.
ఏదో కొంత డబ్బును తల్లిదండ్రులకు ప్రతినెల పంపించుట వారిని సన్మానించుటయైయుండదు. ప్రేమగల హృదయముతో వారితో మాట్లాడుటయును, వారి కొరకు సమయమును కేటాయించి హెచ్చించుటయే వారిని సన్మానించుటయైయున్నది.
మీ యొక్క వృద్ధాప్యములో మీ పిల్లలు మిమ్ములను గమనించు కొనవలెనని మీరు కోరుచున్నప్పుడు, దానిని మీరు మీ తల్లిదండ్రులకు చేయవలెను కదా? “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునైయుండును” (సామెతలు. 1:8,9).
నేడు పలు యవ్వనస్తులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకొనుచున్నప్పుడు, మనస్సును శరీరమును కోరుకొనుచున్నట్లు ఒక జీవిత భాగస్వామిని ఏర్పరచుకుని ఆ తరువాత అవస్థపడుచున్నారు. తల్లితండ్రుల యొక్క ఆలోచనను వినుటలేదు. మీమీద అక్కరగల తల్లిదండ్రులకు మిమ్మల్ని గూర్చిన ఒక ఉద్దేశమును, ఒక ప్రణాళికయు ఉండును. మీ ఇష్టానుసారముగా ప్రవర్తించి, మీ తల్లిదండ్రుల యొక్క మనస్సును నొప్పించకుడి. వారి యొక్క ప్రేమను తృణీకరించకుడి.
ఇస్సాకును చూడుడి, ఆయనకు నలభై సంవత్సరముల వయస్సైనప్పుడు, తన తండ్రి స్వయముగా తనకు జీవిత భాగస్వామిని వెతికి తెచ్చినట్లు సహనముతో ఉండెను. ప్రభువు తానే మిక్కిలి శ్రేష్టమైన దానిని ఏర్పరచి ఇచ్చెను.
అదే సమయములో దావీదు యొక్క కుమారుడైన అబ్షాలోమును చూడుడి. తాను రాజుకాలెను అను అత్యాశతో తన తండ్రికి విరోధముగా లేచెను. తండ్రిని వెళ్ళగొట్టేను, తండ్రి యొక్క ఉపపత్నుల యొద్దకు ప్రవేశించి ప్రభువునకు హేయమైన దానిని చేసెను.
అంతమునందు అతడు మస్తకి వృక్షము యొక్క చిక్కుకొమ్మలకు తగులుకొని ప్రాణాలతో వ్రేలాడ వలిసినదైయుండెను. అప్పుడు యోవాబు మూడు బాణములు చేత పట్టుకొని పోయి వాటిని అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి పొడిచెను. యోవాబు ఆయుధములను మోయువారు పదిమంది అబ్షాలోమును కొట్టి చంపిరి (2. సమూ. 18:14,15). దేవుని బిడ్డలారా, ఎంతటి వేదనకరమైన మరణము అది!
నేటి ధ్యానమునకై: “తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును” (నిర్గమ. 21:15).