జూలై 06 – ఉరుముల వంటి శబ్దము!
“తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతట నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను” (యోహాను. 12:28).
తన యొక్క మరణపు సమయము సమీపించుచున్నది అనుటను యేసు గ్రహించి, “తండ్రి, నీ నామమును మహిమపరచుము” అని చెప్పెను. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి మరణము దేవుని యొక్క నామమును మహిమ పరచుచున్నదై ఉండవలెను. “ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు” (ప్రసంగి. 7:1). ప్రారంభము కంటేను అంతము సంపూర్ణముగా ఉండవలెను. ప్రారంభము అల్పముగా ఉండినను, అంతమైతే మహిమకరముగా కనబడవలెను.
శాపమును, అంధకారమును, వ్యాధులును, ద్రోహములును, సమస్యలును నిండిన లోకములో మనము జీవించుచున్నాము. దేవుని చేత పడద్రోయబడిన దేవదూతలు ఈ భూమిమీద త్రోయబడినందున, భూమి అనునది నిరాకారముగాను, శూన్యముగాను మారెను. మనుష్యుడు పడిపోయినప్పుడు, అతనిపై వచ్చిన శాపము నిమిత్తమును భూమి ముండ్ల తుప్పలను, గచ్చపొదలను మొలిపించెను.
యేసు, తాను పొందవలసిన సిలువ మరణము గొప్ప వేదనగలదైయుండును అని ఎరిగియుండెను. ముండ్ల కిరీటము ధరించబడి, దిగంబరుడై జనుల ఎదుట వ్రేలాడవలసిన సంగతిని, నిందకును అవమానమునకును తన్ను అప్పగించుకొనవలసిన సంగతిని ఎరిగియుండెను. సహజముగ, సిలువకు వేయబడియున్నవారు ఎల్లప్పుడును జనులను శపించెదరు, దేవుని దూషించెదరు, భరించలేని వేదనతో విలపించెదరు. అయితే యేసు, ఆ గడియను ప్రార్ధనా ఘడియగా చేసి, దేవుణ్ణి మహిమపరచుటకు తీర్మానించెను.
“చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, భూమిమీద నిన్ను మహిమ పరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము” (యోహాను. 17:4,5). అనుటయే గెత్సమనె తోటలో ఆయన యొక్క ప్రార్థనయైయుండెను.
ప్రవక్తయైన యెషయా అట్టి దృశ్యమును తన ప్రవచనాత్మక కన్నులతో చూచి: “ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను, అనేకుల పాపమును తానే భరించుచు, తిరుగుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపనముచేసెను, కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును” (యెషయా. 53:12) అని చెప్పెను. ఆయన యొక్క మరణమునందును తండ్రిని మహిమ పరచినందున, అట్టి సమయమునందును ఆత్మసంపాదయము చేయుటకు ఆయన వలన సాధ్యమాయెను. ఆయనతో పాటు సిలువులో వ్రేలాడిన దొంగ రక్షింపబడుటకు హేతువాయెను.
నేడు అనేకులు మరణమును గూర్చి భయపడుచున్నారు. వారిలో అనేకులు సమాధి దొడ్లకు కూడాను వెళ్ళుట లేదు. వీధులలో శవమును ఊరేగించుచు తెచుచున్నారంటే, ఇండ్లలోని గదిలోనికి వెళ్లి దాగుకొందరు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అయినను, మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” (హెబ్రీ. 9:27). దేవుని బిడ్డలారా, మీ యొక్క అంతము సంపూర్ణముగాను, మహిమగలదిగాను ఉండవలెను.
నేటి ధ్యానమునకై: “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది” (కీర్తనలు. 116:15).