జూలై 03 – ఆకాశమునుండి ఒక శబ్దము!
“ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను ఏదనగా: ‘రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన: నీ రాజ్యము నీయొద్ద నుండి తొలగిపోయెను” (దానియేలు. 4:31).
నెబుకద్నెజరు తన రాజ్యమును గూర్చియు తన పరిపాలనను గూర్చియు ఎంతో అతిశయించాడు. భూమ్యాకాశములు యెహోవావని ఆయన మరచిపోయాడు. అంతేకాదు, తాను భూమిమీద జీవించడానికిని మరియు పరిపాలించడానికిని దేవుడే తనకు కృపతో ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు అను సంగతిని కూడా ఆయన విస్మరించాడు.
ఒక రోజున, రాజు బబులోనులోని రాజనగరునందుగల రాజభవనముపై అటుఇటు తిరుగుచు ఇలా అన్నాడు: “బబులోనను ఈ మహా విశాలపట్టణము, నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది గదా?” (దానియేలు 4:30).
చాలామంది పరలోకము నుండి ప్రేమతోకూడిన, మధురమైన స్వరములను వినియున్నారు. కొన్ని సార్లు, కొంతమంది హెచ్చరిక స్వరములను కూడా వినియున్నారు. కానీ ఈ సందర్భములో పరలోకము నుండి వచ్చిన స్వరము దైవీక తీర్పునకు సంబంధించినదైన స్వరము.
“రాజగు నెబుకద్నెజరూ, ఇదే నీకు ప్రకటన: రాజ్యము నీ యొద్దనుండి తొలగిపోయెను! తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగున జరుగును” (దానియేలు 4:31–32). గొప్ప ప్రతిభావంతుడైన ఒక మనుష్యుడు గర్వము కారణముగా జంతువులా మారిపోయెను.
దేవుని బిడ్డలారా, గర్వానికి ఎన్నడును చోటు ఇవ్వకుడి. గర్వము అనునది సాతాను నుండి పుట్టిన ఒక గుణాతిశయము, దానిని మనము ఖచ్చితముగా ఎదిరించాలి. లేకుంటే, ప్రభువే స్వయముగా మిమ్ములను ఎదిరించవచ్చును, మరియు మీరు కూడాను తగ్గించబడవచ్చును.
లూసిఫర్‌ను గమనించి చూడుడి. పరలోకములో అతడు ఒక శక్తివంతమైన దూతగా, అభిషేకించబడిన కెరూబుగా, సంపూర్ణమైన సౌందర్యమును మరియు పరిపూర్ణమైన జ్ఞానముతోను నిండినవాడై, కాలుచున్న రత్నముల మధ్య సంచరించుచుండెను. అయితే అతని హృదయములో గర్వము ప్రవేశించినప్పుడు, అతడు పరలోకము నుండి పడద్రోయబడెను. అతడు నాశనములో పడిపోయి సాతానుగా మారిపోయెను. గర్వము గొప్ప పతనానికి దారితీస్తుంది. మహిమగల దూత అయినప్పటికిని, గర్వము అతనిని అపవాదిగా మార్చివేసెను.
అదే గర్వము నెబుకద్నెజరును ఒక జంతువు స్థితికి దిగజార్చి, పిచ్చివాడిని చేసింది.ఆ ఏడు సంవత్సరముల గడిచిన తర్వాతనే నెబుకద్నెజరు పరలోకము వైపు తన కన్నులను ఎత్తెను. ఆయన భూమ్యాకాశములను సృష్టించిన సృష్టికర్తయైన ప్రభువు వైపు తన హృదయమును త్రిప్పెను. ఆ తర్వాత ఆయన బబులోను యొక్క ప్రభావమును మరియు ఘనతపై దృష్టిని పెట్టలేదు. ఆయన సర్వోన్నతుడైన దేవుని వైపు చూచినప్పుడు, ఆయన బుద్ధి ఆయనకు తిరిగి వచ్చెను.
దేవుని బిడ్డలారా, మీ కన్నులు ఎల్లప్పుడును పరలోకము తటునే ఉండనివ్వుడి. ఈరోజే కొంత సమయమును కేటాయించి, పరలోకపు దేవునికి స్తుతియు, ఆరాధనయు మరియు మహిమయు చెల్లించుడి.
నేటి ధ్యానమునకై: “ఇప్పుడు నెబుకద్నెజరను నేను, పరలోకపు రాజును స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచునున్నాను. ఆయన యొక్క కార్యములన్నియు సత్యములును, మార్గములు న్యాయములునైయున్నవి” (దానియేలు. 4:37).