జూన్ 22 – దేవుని పొలము!
“మీరు దేవుని (వ్యవసాయము) పొలమును, దేవుని గృహమునైయున్నారు” (1. కొరింథీ. 3:9).
క్రైస్తవ మార్గమునకు ఉండవలసిన గొప్ప ప్రాముఖ్యమైన రెండు జ్ఞానములు కలవు. మొదటిది, మన దేవుడు ఎవరు అని దేవుని గూర్చిన జ్ఞానము. రెండోది, క్రీస్తునందు మనము ఎవరు అని మనలను గూర్చిన జ్ఞానము. ఇట్టి రెండు రకములైన జ్ఞానమును మనము ప్రభువునందు ముందుకు కొనసాగుటకును, ఆశీర్వాదములను పొందుకొనుటకును, విజయవంతమైన జీవితమును జీవించుటకును మనకు మిగుల ప్రయోజనకరముగా అమర్చబడియున్నది.
క్రీస్తునందు మనము ఎవరు అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది? మనము లోకమునకు వెలుగైయున్నాము (మత్తయి. 5:14). మనము లోకమునకు ఉప్పైయున్నాము (మత్తయి. 5:13). దేవుని యొక్క పిల్లలమైయున్నాము (యోహాను.1:12). నేటి ప్రారంభ వచనములో మనము దేవుని యొక్క పొలముగా ఉండుటతోపాటు, దేవుని యొక్క భవనముగా ఉన్నాము అని అపో. పౌలు చెప్పుచున్నాడు.
పొలము అను మాటను గ్రామములలో అధికముగా వాడబడుచున్న ఒక మాటయైయున్నది. భూములు, గొర్రె ఆవులు, పనివారు మొదలగు వసతులు గల వ్యక్తిని భూస్వామి అని మనము పిలచుచున్నాము. అలాగే అయితే మనము దేవుని యొక్క వ్యవసాయమునై ఉన్నప్పుడు అక్కడ మనకు పనులు కలదు. బాధ్యతలు కలదు. ప్రభువుతో నిలబడుచున్నాము అను ఆనందమును కలదు.
పాత నిబంధనయందు ప్రభువు ఇశ్రాయేలు జనులను తన యొక్క పొలముగా ఏర్పరచుకొనెను. అయితే వారు ప్రభువును విడిచి తొలగిపోయినప్పుడు ప్రవక్తయైన యెషయా దుఃఖముతో: “ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది” అని చెప్పుచున్నాడు (యెషయా. 1:8).
కారణము ఏమిటి? ప్రభువు యొక్క పొలములో ఏకమనస్సును ఐక్యమత్యమును లేదు. కావున శత్రువు అట్టి పొలమును వ్యర్థము చేసి, నాశనము చేయుచున్నాడు. చక్కటి ద్రాక్ష తోట ఉండవలసిన స్థలమునందు ముల్లును, గచ్చపొదలును కలుపును పెరిగి పొలమును చెరిపివేసెను.
క్రీస్తునందు మనమందరమును ఒకే కుటుంబమును, ఒకే పొలమునైయున్నాము. ప్రభువుతో కలిసి పని చేయుచున్నవారు ఈ పొలములో అతిశయించుటగాని, నేను గొప్పవాడును నీవు గొప్పవాడువు అని వాదములు వేసుకొన కూడదు. “ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా? నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే” (1. కోరింథీ. 3:4,6) అని బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము.
దేవుని బిడ్డలారా, మన యొక్క తలాంతులు, సామర్థ్యములు, ఆత్మీయ వరములు అన్నియు ప్రభువు మనకు కృపగా దయచేసిన వరములు. వాటిని మనము వాడుకొనునట్లు ప్రభువు యొక్క పొలములో పనివారముగా ఉన్నాము. కొంచములో నమ్మకస్థలుగా ఉండినట్లయితే ప్రభువు మనలను అనేకమైన వాటిపైన అధికారిగా హెచ్చించును అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
నేటి ధ్యానమునకై: “మనము మేలు చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము” (గలతి. 6:9).