జూన్ 11 – చులకని శ్రమ!
“మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ఘనతను కలుగజేయుచున్నది.” (2. కోరింథీ. 4:17).
మనము ఈ లోకము గుండా నడిచి వెళ్ళుచున్నప్పుడు, ప్రభువు మనకు కొంతమంది సహాయకర్తలను దయచేయును. ఆదరణకరమైన సమయములను ఇచ్చుచున్నాడు. పరుస్థుతులను ఇచ్చుచున్నాడు. స్థలములను ఇచ్చుచున్నాడు. అయితే, మనము ప్రభువును ఆశ్రయించక, ప్రభువు ఇచ్చుచున్న ఆదరణలను మాత్రమే ఆశ్రయించుచున్నప్పుడు, ఆయన వాటిని మన వద్ద నుండి తీసివేయుచున్నాడు.
అట్టి సమయమునందు అంతరంగము కలవరపడుచున్నది. ప్రభువు దీనిని ఎందుకు చేసాడు అని నొచ్చుకొనుచున్నాము. అయితే దినములు గడిచేకొలది అట్టి ఆదరణలు లేకుండానే జీవించగలము అను సంగతిని, అది నష్టము కాదు లాభమే అని గ్రహించుచున్నాము. మనకు వచ్చుచున్న ఈ చులకని శ్రమ మనకు నిత్య మహిమను తీసుకొని వచ్చుచున్నది అని మనము దిట్టముగా తెలుసుకొందుముగాక.
ఒక అతి పెద్ద మర్రి చెట్టు క్రింద ఒక చిన్న పూల మొక్క ఉండెను. ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మలకు క్రింద ఆ పూల మొక్క ఆనందించుచుండెను. అయితే ఒక దినమందు ఆ భూమి యొక్క భూస్వామి తన గొడ్డలి చేత ఆ పెద్ద మర్రి చెట్టును కర్కసముగా నరికి పడవేసెను.
అందువలన ఆ చిన్న పూల మొక్క కన్నీరు విడిచి విలపించెను. “అయ్యో, నా యొక్క దాగు స్థలము పోయెనే! నా నీడ వెళ్ళిపోయేనే! తుఫాను వీచినట్లయితే నేను ఏమి చేయదును?” అని రోధింపసాగెను!
అయితే కొంతసేపటిలో ఆ పూల మొక్కపై మధురమైన సూర్యునికి కాంతి వెదజల్లేను, వర్షపునీళ్లు తిన్నగా తనపై కురిసెను. చల్లటి పిల్లగాలి పూల మొక్కను ఆనందింపజేసెను. మర్రి చెట్టు పోతేనేమి? దానిని కలుగజేసిన ప్రభువు నాతో ఉన్నాడు అని తలంచి ఆ పూల మొక్క ఆదరణను ఓదార్పును పొందెను.
యోనాను చూడుడి, “దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు ఏపుగా పెరుగునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను” (యోనా. 4:6).
యోనా సంతోషించినది వాస్తవమే. ఆ సొర చెట్టును చూచి యోనా బహుగా సంతోషించెను గాని ఆత్మలను గూర్చిన భారము వహించలేదు. సొర చెట్టు కంటే వేలకొలది విత్తనాలు చేత తనను ఆనందింప చేయు ప్రభువును స్తుతించలేదు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగునకు ఆజ్ఞాపించగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు ఆదరణకర్తలను ఇచ్చుచున్నప్పుడు, ప్రభువును ఆనుకొని ఆయనను స్తుతించుడి. ఒకవేళ ఆదరణ మిమ్ములను విడిచి తీసివేయబడుచున్నప్పుడు మనస్సునందు సొమ్మసిల్లక ప్రభువును ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలునకై జరుగుచున్నది అని విశ్వసించుచున్నవారై ఎల్లప్పుడును ప్రభువును స్తోత్రించుడి.
నేటి ధ్యానమునకై: “నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయెను” (కీర్తనలు. 119:71).