ఆగస్టు 28 – నిజమైన ద్రాక్షావల్లి!
“నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి ద్రాక్షాతోట వ్యవసాయకుడు” (యోహాను. 15:1).
సృష్టికర్త గాను, మనలను కలుగజేసినవాడిగాను ప్రభువు ఉన్నాడు. కొన్ని సమయములలో తండ్రి వలె ఆయన యొక్క ప్రేమను పొందుకొనుచున్నాము. తల్లి వలె ఆయన యొక్క ఆదరణను, ఓదార్పును పొందుకొనుచున్నాము. తోడపుట్టిన సహోదని కంటే మిగుల ఆప్యాయత గలవాడిగా మన కుటుంబములో ఆయన ఉన్నాడు. ఒక బోధకుడుగాను, ఆలోచనకర్తగాను ఆయన మనలను త్రోవ నడిపించును. అరణ్యము వంటి ఈ లోకములో ఆశ్రయించేటువంటి ప్రాణ ప్రియుడిగాను, వరుడిగాను ఉన్నాడు.
యేసు ఎటువంటివాడో అని ఎరుగుటకు అడవి మేడి చెట్టును ఎక్కిన జక్కయ్యకు ఆయన రక్షకుడుగా తన్నుతాను బయలుపరచుకొనెను (లూకా. 19:4,9). ఆయన లోకము యొక్క పాపమును మోసుకుని వెళ్లేటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లగాను పాప నివారణ బలిగాను కనబడుచున్నాడు. ఇంకను సమీపించి వచ్చుచున్నప్పుడు ఆయన అభిషేక నాధుడుగాను, పరిశుద్ధ ఆత్మచేతను అగ్నిచేతను బాప్తీస్మము ఇచ్చువాడుగాను కనబడుచున్నాడు.
ఆయన ఎటువంటి వాడు అని ఎరుగుటకు కోరుచున్నప్పుడు, పరమ వైద్యుడుగాను, రోగములన్నిటిని స్వస్థపరచువాడుగాను కనబడుచున్నాడు. దావీదును అడిగినట్లయితే: “యెహోవా నా యొక్క కాపరిగా ఉన్నాడు. నేను ఆయన మందలోని గొర్రెగా ఉన్నాను” అని జవాబును చెప్పును.
అయితే పైన ఉన్న వచనములో, యేసుక్రీస్తు తాను ఎవరు అనియు, తండ్రి ఎవరు అనియు రెండు ప్రత్యక్షతలను ఇచ్చుటను చూచుచున్నాము. తనను గూర్చి: ‘నేనే నిజమైన ద్రాక్షావల్లిని” అని చెప్పుచున్నాడు. “నా తండ్రి ద్రాక్షతోట వ్యవసాయకుడు” అని తండ్రిని గూర్చి తెలియజేయుచున్నాడు. మూడవదిగా, ద్రాక్షావల్లిలో ఉన్న తీగలే విశ్వాసులు. “ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును” (యోహాను. 15:5) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
ప్రభువు ఇట్టి ఔన్నత్యమైన బంధమును మనకు ఏర్పరచి ఇచ్చుచున్నప్పుడు, దానితోపాటు మన పట్ల తన యొక్క కాంక్షను కూడా తెలియజేయుచున్నాడు. ఫలించని ద్రాక్ష తీగగాను లేక చేదైన, పులుపైన ఫలమును ఇచ్చు ద్రాక్ష తీగగాను ఉండకూడదు అనుటయును, మంచి ఫలమును ఇచ్చు ద్రాక్షా తీయగా ఉండవలెను అనుటయే ఆయన యొక్క కాంక్షగా ఉన్నది.
ఆత్మఫలమే మంచి ఫలము అని పిలవబడుచున్నది. “ఆత్మఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము; ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు” (గలతి. 5:22,23).
ఒక తీగ అనునది వల్లితో నిలిచియున్నపుడు, తీగలోనుండి సత్తువ అంతటిని పొందుకొనుచున్నది. అదేవిధముగా మీరు క్రీస్తుతో పాటు నిలిచి ఉన్నప్పుడు ఆయన యొక్క గుణాతిశయము, స్వభావము అన్నియు నిశ్చయముగా మీలోనికి దిగివచ్చి క్రీస్తు యొక్క మాధుర్యమును మీలోనికి తీసుకొని వచ్చును.
దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములను మీలో చూచుచున్నవారు ప్రభువు మంచివాడు అను సంగతిని రుచి చూచుదురు.
నేటి ధ్యానమునకై: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు” (యోహాను. 15:8).