ఆగస్టు 10 – “ఒంటరితనమును శ్రమలును!”
“అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక; సంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాక, మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక; దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక” (యోబు. 3:6,7).
సాతాను యొక్క శోధనను బట్టి భక్తుడైన యోబు ఒంటరియైన స్థితికి వచ్చెను. ఒకే దినములో ఆయనకు ఉన్న ఆస్తులన్నియును, పిల్లలును ఆయనను విడిచి పెట్టి పోయిరి. భార్య యొక్క అండగాని, ప్రేమ గాని, ఆదరణతో కూడిన మాటలు కూడా ఆయనకు దొరకలేదు.
ఆమె యోబును చూచి: “నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను” (యోబు. 2:9). ఇట్టి వంటరితనమును యోబు తనకు తానుగా ఆయనపై వేసుకున్న ఒంటరితనము కాదు. సాతాను ఆయనపై బహు బలవంతముగా మోపిన ఒంటరితనము. ఇట్టి ఒంటరితనమైన త్రోవలో యోబు విచారముతో దాటి వెళ్ళవలసినదై ఉండెను. అయినను ప్రభువు తనపై ఉన్న ఒంటరితనమును ఒక దినమున నిశ్చయముగా తీసివేయును అను నమ్మిక ఆయనలో ఉండెను.
యోబు భక్తుడు చెప్పుచున్నాడు: “నేను వెళ్ళు మార్గము ఆయనకు తెలియును; ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును” (యోబు. 23:10). ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును; నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు; నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు; అగ్నిజ్వాలలు నిన్ను కాల్చవు” (యెషయా. 43:2).
యోబు యొక్క ఒంటరి తనపు వేదనను మార్చుటకు ప్రభువు ముఖాముఖిగా భక్తుడైన యోబునకు దర్శనమిచ్చెను. “నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన అంత్య దినమునందు భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, నేను నా శరీరమునందుండి దేవుని చూచెదను” (యోబు. 19:25,26) అని భేరించెదను.
అట్టి దర్శనము యోబు యొక్క ఒంటరితనమును తలంపును మార్చి వేసి, దైవ ప్రసన్నతను, నమ్మికను, ఆదరణను తీసుకొని వచ్చెను. ‘నేను నా విమోచకునితో నిరంతరము జీవించెదను. ఆయనను నేనే చూచెదను. నా కన్నులే ఆయనను చూచును’ అని ఆయన విశ్వసించినట్లుగానే పునరుత్థానుడైన క్రీస్తు ఆయన యొక్క జీవితములో తారసపడెను. సాతాను యొక్క శోధనలకు ఒక ముగింపును కలుగజేసి, ఒంటరితనము యొక్క వేధనలో నుండి యోబును విడిపించెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు” (యోహాను. 8:36).
భక్తుడైన యోబునకు ఒంటరితనము ఉండినట్లుగా, అపో. పౌలునకును ఒంటరితనము ఉండెను. ఆయన సహోదరులను ఎడబాసి, సంఘమును ఎడబాసి, వేరు చేయబడి రోమాపురి చెరసాలలో ఒంటరిగా బందించబడెను. దేవుని బిడ్డలారా, “ఎట్టి పరిస్థితులయందు ఉండినప్పటికీని మనస్సునందు మహానందముతో ఉండవలెను అను సంగతిని” ఆయన ఒంటరితనములో నేర్చుకున్న పాఠముగా ఉన్నది.
నేటి ధ్యానమునకై: “నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను; గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని” (2. తిమోతికి. 4:17).