అక్టోబరు 23 – సిద్ధపరచిన తరువాత!
“నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన (యెడల) తరువాత, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేను మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” (యోహాను. 14:3)
ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రభువు పాలు తేనే ప్రవహించు కనానును సిద్ధపరచెను. అది సిద్ధపరచుబడువరకును వారు బానిసలువలె ఐగుప్తునందు జీవించిరి. ఒకవైపున కనానునందుగల సకల అడవి మృగములును నశింపబడవలెను, బాగుచేయవలెను. ఇండ్లు, ద్రాక్ష తోటలును నాటబడవలెను. మరోవైపున అక్కడ ఉన్న జనముల యొక్క పాపములు పరిపక్వము చెందవలెను
దాని తరువాత, ప్రభువు తానే దిగివచ్చి, గొర్రె పిల్ల యొక్క రక్తము చేత ఇశ్రాయేలీయులను విమోచించుకుని, మేఘ స్తంభములును అగ్నిస్తంభములును త్రోవ నడిపించగా, కనానునకు వెళ్లి చేరునట్లుగా చేసెను. అది ఇశ్రాయేలీయుల కొరకు వాగ్దానము చేయబడిన స్థలము. అక్కడ తాము కట్టని ఇండ్లను, నాటని ద్రాక్షా తోటలను స్వతంత్రించుకొనిరి.
ఆత్మీయ ఇశ్రాయేలీలమైయున్న మనకు, పరలోకపు కనాను సిద్ధపరచబడియున్నది. మీరు ఎలాగైనను వచ్చి పరలోకపు కనానును స్వతంత్రించుకొనుడి అని చెప్పకుండా, “నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకుని పోవుదును” అని ప్రేమతో చెప్పుచున్నాడు. “నేను మరలా వచ్చెదను” రెండవ రాకడలో వచ్చుచున్నప్పుడు మరియ తనయుడుగానో, పసి బాలుడుగానో కాకుండా తండ్రి యొక్క మహిమను ధరించినవాడై దేవదూతల యొక్క బూరలతోను మధ్యాకాశము నుండి ఆయన దిగి వచ్చును.
క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి, బైబిలు గ్రంథమునందు ఒక వెయ్యి ఏడువందల ఇరవైఐదు వాగ్దానములు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో పదకొండు వచనములకు ఒక వచనము చొప్పున క్రీస్తు యొక్క రాకడను సూచించి చూపెట్టుచున్నది. మొదటి రాకడను గూర్చి ఒక వచనము బైబిలు గ్రంథమునందు ఉండినట్లయితే, ఆయన యొక్క రెండవ రాకడను గూర్చి ఎనిమిది వచనములు ఉన్నాయి. థెస్సలోనికయ్యులకు వ్రాసిన రెండవ పత్రిక యొక్క కేంద్ర సారాంశము క్రీస్తు యొక్క రెండవ రాకడయే.
నిశ్చయముగానే నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్పుచున్నప్పుడు: “ఆమేన్; ప్రభువైయున్న యేసూ, రమ్ము” (ప్రకటన. 22:20) అని మీరు ఉత్సాహముతో చెప్పుచున్నవారై ఉండవలెను. క్రీస్తు మన కొరకు సిద్ధపరచియున్న స్థలమును తన యొక్క శిష్యుడైన యోహానునకు చూపించెను. “యోహాను అను నేను, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుటను చూచితిని* (ప్రకటన. 21:2) అని చెప్పెను.
నూతన ఎరూషలేమునకు మనలను వెంటపెట్టుకుని వెళ్ళుట కొరకు, ప్రభువు తన యొక్క దూతలను గాని, కేరూబులను గాని పంపించి మాట్లాడుకుండా ఉండిపోవుటలేదు. ఆయన తానే స్వయముగా వచ్చి మనలను వెంటపెట్టుకొని వెళ్ళుటకు వచ్చును. అలాగైతే మనము ప్రభువు యొక్క దృష్టిలో ఎంతటి ఘనత పొందినవారము! పెండ్లి కుమార్తెను పిలుచుటకు పెండ్లి కుమారుడు తానే స్వయముగా రావలెను!
నేటి ధ్యానమునకై: “సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము” (1. థెస్స. 4:17).