మే 16 – కృతజ్ఞుడనైయున్నాను!
“నన్ను బలపరచిన మన ప్రభువైన యేసుక్రీస్తు నన్ను నమ్మకమైన వానిగా ఎంచి, ఇట్టి తన పరిచర్యకు నియమించినందుకు, ఆయనకు కృతజ్ఞుడనైయున్నాను” (1. తిమోతి. 1:12,13).
“ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” అని చెప్పిన అపో. పౌలు, తానే అన్నిటి కొరకు కృతజ్ఞతను తెలియజేయుటయందు ఆదర్శవంతముగా ఉండెను. సమస్యల మధ్యలోను కూడాను, పోరాటముల మధ్యలోను కూడాను ఆయన కృతజ్ఞతను చెల్లించెను.
ఆయన రోమా పట్టణపు చెరసాలలో వేయబడినప్పుడు కూడాను ప్రభువును స్తుతించెను. ఇట్టి స్తుతి ఎల్లప్పుడును ఆయన యొక్క నోట ఉండుట చేతనే ఆయన యొక్క సంతోషమును ఎవరును తీసివేయలేక పోయెను.
ఆయన చెరసాలలో ఉండి ఫిలిప్పీయులకు వ్రాయుచున్నప్పుడు: “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి” (ఫిలిప్పీ 4:4) అని సూచించెను. ప్రభువును స్తుతించేటువంటి మనుష్యుడే ఎల్లప్పుడును సంతోషముగా ఉండగలడు.
కోట్ల కొలది ప్రజలు ఉన్నప్పుడు ప్రభువు ఆయనకు ప్రత్యేకముగా అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ సంతోషము, నిత్య జీవము, దైవీక సంతోషము, దైవీక సమాధానము మొదలగు అమూల్యమైన అంశములను ఆయన ఒకసారి తలంచి చూచినప్పుడు ఆయన స్తుతించక ఉండలేక పోయెను. అట్టి పరవశమును పొంది, “దేవుడు అనుగ్రహించిన చెప్ప శక్యముకాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము” అని చెప్పి స్తుతించెను (2. కోరింథీ. 9:15).
రక్షణ కొరకు మాత్రము గాక, “తనను నమ్మకమైన వానిగా ఎంచి, ఇట్టి తన పరిచర్యకు నియమించినందుకు, ఆయనకు కృతజ్ఞుడనైయున్నాను” (1. తిమోతి.1:12,13) అని ఆయన చెప్పుచున్నాడు. విశ్వాసిగా ఉండుట కొరకే వేలకోట్ల స్తోత్రములు చెల్లించవలెను అంటే, పరిచారకుడుగా ఉండుటకు ఎన్ని కోట్ల స్తోత్రములను, స్తుతులను అత్యధికముగా చెల్లించవలెను!
“ప్రభువు యొక్క కన్నులయందు కృప దొరుకుట మాత్రము కాదు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచి, ఇట్టి పరిచర్యను నా హస్తములలోనికి ఇచ్చేనే! పలు సమయములలో నేను నమ్మకమైన వానిగా లేకుండినప్పటికిని నన్ను పిలిచినవాడైతే నమ్మకమైనడైయున్నాడు, నన్ను కూడాను నమ్మకమైన వానిగా ఎంచియున్నాడు’ అను తలంపు ఆయనలో ఒక మెరుపు మెరిసినప్పుడు, ఆయన వలన స్తుతించక ఉండలేకపోయెను.
ప్రభువు యొక్క పరిచర్య కొరకు ప్రభువు చేత ఎన్నుకొన్నబడుట ఒక సాధారణమైన అంశము కాదు. “అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడైయితేనే గాని, ఎవడును ఈ ఘనమైన పరిచర్యకు తనకు తానే వహించుకొనడు” (హెబ్రీ. 5:4) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. డి. ఎల్. మూడీ అను భక్తుడు విశ్రాంతి దిన పాఠశాలకు పిల్లలను తీసుకుని వెళ్లే పరిచర్యనే మొదట చేసెను. ప్రభువు ఆయనను ఘనపరచి, హెచ్చించి, మహా గొప్ప సువార్తికుడిగా ఏర్పరచుకొనెను కదా!
దేవుని బిడ్డలారా, ప్రభువు మీ యొక్క హస్తములలో ఒక పరిచర్యను ఇచ్చినట్లయితే దానిని మిగుల భయభక్తితోను, నమ్మకముతోను, యధార్ధతతోను చేయవలెను!
నేటి ధ్యానమునకై: “ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును” (ప్రకటన. 22:4).