నవంబర్ 17 – ముందరచూచుచు!
“అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను”(ఫిలిప్పీ.3:13,14).
మీరు అప్పుడప్పుడు దేవుని సముఖమందు మిమ్ములను నిలబెట్టుకుని నూతన తీర్మానాలను, నూతన ప్రతిష్టలను చేయుచున్నప్పుడు, విజయపు తట్టునకును, ప్రభువు యొక్క సముఖమునందు గల ఆనందము తట్టునకును, పరలోకపు రాజ్యపు ఔన్నత్యము తట్టునకును నడచి వెళ్ళుచున్నారు అను సంగతిని మీరు మరచిపోకూడదు.
మీరు నూతన సంవత్సరమునందు పలు ప్రతిష్టలను చేయుదురు. అదే విధముగా ప్రతి మాసము యొక్క ప్రారంభమునందును కొన్ని తీర్మానములను మీరు చేయవలెను. దాని ప్రకారముగా నడవవలెను. ప్రతి దినమును ఉదయకాలమునందు మిమ్ములను దేవుని సముఖమునందు అర్పించి ప్రార్ధించవలెను. అపోస్తులుడైన పౌలు,. “వెనక ఉన్నవాటిని మరచెదను. ముందున్న వాటికై వేగిరపడెదను. గురియొద్దకే పరిగెత్తెదను” అని వ్రాయుచున్నాడు. అదే పౌలు యొక్క తీర్మానమై ఉన్నది.
మొట్టమొదటిగా మీరు, వెనక ఉన్నవాటిని, నీచమైనవాటిని, దేవునికి ఇష్టములేని వాటిని సంపూర్ణముగా మీవద్ద నుండి తొలగించవలెను. సొదొమాను విడిచి బయటకు వచ్చిన మీరు మరల సొదొమా వైపుతిరిగి చూస్తూఉండ కూడదు. ఐగుప్తును విడిచి బయటకు వచ్చిన మీరు ఐగుప్తునందు గల దోసకాయలను, వెల్లుల్లిపాయలను, చేపలను తలంచుకొనుచు ఉండకూడదు.
కొందరికి వారి యొక్క గతకాల సంఘటనలు వారియొక్క హృదయమునందు దుఃఖమును, వేధనను తెచ్చుచున్నది. మరికొందరైతే గత కాలమునందు జరిగిన పాత అనుభవములనే మాట్లాడుచూ, నూతన నడిపింపునకు తమ్మును అప్పగించు కొనకయుందురు. ఒకసారి బెర్నార్డ్ షా, “గతకాలపు జ్ఞాపకాలు మనుష్యుని జ్ఞానవంతునిగా చేయటలేదు. రానున్నకాలము గూర్చిన బాధ్యతగల గ్రహింపు జ్ఞానవంతునికి సూచనయైయున్నది” అని చెప్పెను.
రెండవదిగా, ముందున్న వాటికొరకును, ఔనత్యము గల వాటికొరకును, నూతన కార్యములకొరకును వేగిరపడుడి. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, “మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను”(యెషయా.43:18,19). ప్రభువు నూతన కార్యమును మీ యొక్క జీవితమునందు చేయును.
మూడవదిగా, బస్సు, ఓడ, విమానము మొదలగునవి వెళ్లు స్థలమును గూర్చిన గమ్యమున్నట్లుగా, మీకును ఒక గురి కలదు. అట్టి గురి భూమియందు క్రీస్తుని పరిపూర్ణతయైయున్నది. నిత్యత్వమునందు పరమ కనానైయున్నది. దేవుని బిడ్డలారా మీరు గురి తట్టునకు సాగి పోవుచు ఉండెదరా?
నేటి ధ్యానమునకై: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము”(హెబ్రీ.12:1,2).