జూలై 21 – ఒక నివాసస్థలము!
“నా తండ్రి యింట అనేక నివాసములు కలవు; లేనియెడల, మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు ఒక స్థలము సిద్ధపరచినయెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” (యోహాను. 14:2,3).
యేసు ఈ భూమిని విడిచి పెట్టి వెళ్ళుచున్నప్పుడు, మన కొరకు ఒక నివాస స్థలమును సిద్ధపరచుదునని చెప్పెను. పరలోకమునందు అనేక నివాస స్థలములు కలవు. సీయోను పర్వతమును చూచుచున్నాము. అక్కడ గొర్రెపిల్లయైనవానిని, ఆయనతో కూడా ఆయన తండ్రి నామమును తమ నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమందిని చూచుచున్నాము (ప్రకటన. 14:1).
నూతన యెరూషలేమును చూచుచున్నాము. “అది తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడియున్నది” (ప్రకటన. 21:2) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. మరియు నూతన భూమిని చూచుచున్నాము. రక్షింపబడుచున్న జనములు దాని వెలుగునందు సంచరింతురు (ప్రకటన. 21:24). నూతన ఆకాశమును చూచుచున్నాము, మేఘమువలె విస్తారమైన గొప్ప సాక్షి సమూహము అక్కడికి వచ్చెదురు (హెబ్రీ. 12:1). ఇలాగున పరలోకములో పలు రకాల స్థలములను గూర్చి ప్రభువు బైబిలు గ్రంధమునందు చెప్పియున్నాడు.
మీ కొరకు నేనుండు స్థలమునందు ప్రత్యేకముగా ఒక నివాసస్థలమును సిద్ధపరచుదును అని క్రీస్తు చెప్పెను. ఆయన మన కొరకు సిద్ధపరచుచున్న నివాస స్థలము ఎంతటి ఔనత్యముగలదిగాను, మహిమగలదిగాను ఉండును! ప్రభువు ఆరు దినములలో లోకమంతటిని ఎంత చక్కగా సృష్టించెను! ఆరు దినములలో రూపించబడియున్న ఇట్టి లోకము ఇంతటి సౌందర్యముగా ఉండినట్లయితే, క్రీస్తు తన పెండ్లి కుమార్తె కొరకు రూపించుచున్న నిత్య నివాసస్థలములు ఎంతటి సౌందర్యముగా ఉండును!
తండ్రి యొక్క ఇంటికి పాత నిబంధన పరిశుద్ధులు వచ్చేదురు. విశ్వాసమునందు సంపూర్ణపరచబడిన వారందరును అబ్రహము యొక్క ఒడిలోనికి వచ్చేదరు; ఇస్సాకువలె ధ్యానించే పురుషులు ఇస్సాకు యొక్క ఒడిలోనికి వచ్చెదరు. యాకోబువలె దేవునితో పోరాడి జయించువారు యాకోబు యొక్క ఒడిలోనికి వచ్చేదరు. హానోకువలె దేవునితో సంచరించినవారు హానోకు యొక్క ఒడిలోనికి వచ్చేదరు.
పాత నిబంధన పరిశుద్ధులు అందరు క్రీస్తు యొక్క స్నేహితులు అను అనుభవములోనికి వచ్చేదరు. మనమైతే క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉందుము. మనము ఆయన యొక్క రక్తమునకును, ఎముకలకును సంబంధించినవారము కదా?
జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని క్రీస్తు చెప్పెను కదా? (ప్రకటన. 3:21). దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సింహాసనమునందు మనము ఆయనతో కూడా కూర్చుందుము.
నేటి ధ్యానమునకై: “ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును; వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును” (ప్రకటన. 21:3).