సెప్టెంబర్ 22 – ఆజ్ఞలనుగైకొను హృదయము!
“వారికిని, వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు, …. నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు (మనస్సు) హృదయము వారికుండిన యెడల మేలు” (ద్వితి. 5:29).
పోలీసు అధికారులును, న్యాయస్థానములును, చెరశాలలును ఉండుట చేత చట్టములను అతిక్రమించి నడచుటకు లోకమునందుగల మనుష్యుడు భయపడుచున్నాడు. లోకానుసారమైన చట్టములకే మనుష్యుడు భయపడుచున్నాడు అంటే, పరలోకపు చట్టములకు అతడు ఇంకను ఇంకెంత అత్యధికముగా భయపడవలెను! ప్రభువు యొక్క ఆజ్ఞలు, శాసనములు, నియమములు అన్నిటిని మీరు పూర్ణ హృదయముతో గైకొనునట్లుగా తీర్మానించుకొనుడి.
పాపము అంటే ఏమిటి? గ్రీకు భాషను బట్టి, దాని అర్థము గురి తప్పుటైయున్నది. బాణమును వృత్తము యొక్క మధ్య భాగములో వేయుటకు శిక్షణ పొందువారు దూరములో ఒక వృత్తమును గీసి, సరిగ్గా ఆ వృత్తములోనికి బాణమును వెయ్యుదురు. అది గురి తప్పి వేరే ఎక్కడైనను వెళ్ళినట్లయితే, అతిక్రమము అను అర్థములో అది అతిక్రమించి వెళ్లిపోయెను అని చెప్పుదురు. ధర్మశాస్త్రమును అతిక్రమించుటయు, మనస్సాక్షిని అతిక్రమించుటయు, దేవుని యొక్క ఆకాంక్షను అతిక్రమించుటయు పాపములే.
ప్రభువు పది ఆజ్ఞలను ధర్మశాస్త్రములో ఇచ్చియున్నాడు. అందులో నాలుగు ఆజ్ఞలు మనుష్యుడు దేవునికి చేయవలసిన బాధ్యతలను గూర్చి మాట్లాడుచున్నది. మిగతా ఆరు ఆజ్ఞలు మనుష్యుల మధ్య ఉండవలసిన అనుబంధములను గూర్చి మాట్లాడుచున్నది.
నలభై దినములు సినాయి కొండపై ఉపవాసముండి, ధర్మశాస్త్రము యొక్క శాసనములను పొందుకొని వచ్చిన మోషే, కొండ చర్యలయందున్న ఇశ్రాయేలు ప్రజలు బంగారపు దూడపిల్లను కలుగజేసుకుని, దాని ఎదుట దిగంబరముగా ఆడిపాడి, సంబరమును చేసుకునియుండుటను చూచెను. కోపముతో మోషే ఆ రెండు రాతి పలకలను కొండ యొక్క చర్యలయందు పడవేసి విరగ్గొట్టేను.
ఒక వైపున ఇశ్రాయేలీయులు మనస్సాక్షిని విరిచివేసిరి. మరోవైపున మోషే రాతి పలకలను విరగ్గొట్టేను. నేడును ప్రజలు క్షణికమైన సుఖములను కోరి దేవునితో గల సంబంధమును విరిచి వేయుచున్నారు. మనస్సును, మాంసమును కోరునట్లుగా నడుచుకొనుచున్నారు. ప్రభువు యొక్క హృదయము విరిగిపోవుచున్నది.
మోషే మరణించుటకు ముందుగా, ద్వితీయోపదేశపు గ్రంథమును తన యొక్క వీలునామాగాను, మరణపు శాసనముగాను వ్రాసెను. “ఇశ్రాయేలియులారా, మీరు క్షేమముగా ఉండవలెను అంటే, ప్రభువు యొక్క ఆజ్ఞలను గైకొనుడి” అని అందులో ఆలోచనను ఇచ్చేను. కొత్త నిబంధనలో ప్రభువు మనకు ఆజ్ఞలు యొక్క నియమమును కాదు, ఆత్మ నియమమును ఇచ్చియున్నాడు. “ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా: వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును; నేను వారికి దేవుడునైయుందును, వారు నాకు ప్రజలైయుందురు” (హెబ్రీ. 8:10).
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క చేతి వ్రేళుతో మీ యొక్క హృదయములో వ్రాయబడుచున్న ఆజ్ఞలను గైకొనుడి. మీరును మీ యొక్క పిల్లలును ఆశీర్వాదముగా ఉందురు.
నేటి ధ్యానమునకై: “వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు ఏదియు జారవు” (కీర్తనలు. 37:31).