Appam, Appam - Telugu

నవంబర్ 09 – విజ్ఞాపన చేయువాడు!

“చనిపోయినది క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును ఆయనే; దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును ఆయనే; మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే” (రోమీ. 8:34).

పునరుత్థానుడైన క్రీస్తు ఒక వైపున మనతో మాట్లాడుచున్నాడు. మరోవైపున మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాడు. ఒకవైపున ఆయన మనతో కూడా ఉన్నాడు, మరోవైపున ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమునందు ఆసీనుడైయుండి, మన కొరకు ఉచ్చరింప శక్యముకాని గొప్ప మూలుగలతో తండ్రి సన్నిధిలో వేడుకొనుచున్నాడు.

పలు సంవత్సరములకు పూరము, ఒక యవ్వనస్థుడు, తన కుటుంబమునందుగల తొమ్మిది మందిని బహు క్రూరముగా హత్య చేసి, గొప్ప అలజడిని సృష్టించెను. ప్రపంచమే అతనిపై కోపగించెను. అతని యొక్క కుటుంబ సభ్యులు అతనిని ద్వేషించి త్రోసి వేసిరి. అయితే అతని యొక్క న్యాయవాది అతని కొరకు వాదించి, అతని కొరకు విన్నవించుకొనెను. అట్టి న్యాయవాది పట్ల ఆ నేరస్థుడు ఎంతటి కృతజ్ఞతను కలిగియుంటాడు!

ఈ లోకమునందు ఎంతటి గొప్ప నేరస్తుడిగా ఉండినప్పటికిని, మహా గొప్ప పాపిగా ఉండినప్పటికిని, నిజమైన పశ్చాతాపముతో విరిగినలిగిన హృదయముతో క్రీస్తు వద్దకు వచ్చుచున్నప్పుడు అతనికి విమోచన కలదు. “యేసయ్యా నా పాపములన్నిటిని క్షమించుము” అని ఒకడు తన్ను తాను తగ్గించుకుని, ఒప్పుకోలు చేయుచున్నప్పుడు, అతని కొరకు క్రీస్తు గాయములను రక్తమును తండ్రి సన్నిధిలో చూపించి బతిమాలుచున్నాడు, విజ్ఞాపన చేయుచున్నాడు.

పాత నిబంధన కాలములో యాజకుడు, నేరస్తుడైన పాపికిని, నీతి గల దేవునికిని మధ్యన నిలబడును. పాపి కొరకు పాప నివారణ బలిని చెల్లించి, “దేవా, ఇతని యొక్క పాపములను క్షమించుము, దోషములను జ్ఞాపకము చేసుకొనకము” అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయును. నేడును ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు నిలబడి ఒకవైపున మీ వద్ద మాట్లాడి: “పొమ్మూ ఇక పాపము చేయకము” అని చెప్పును. మరోవైపున తండ్రి సన్నిధిలో మాట్లాడి మీరు రక్షణ సంతోషమును పొందుకున్నట్లు చేయుచున్నాడు.

“క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి, తానే నిత్యమైన విమోచన సంపాదించెను” (హెబ్రీ. 9:11,12).

సాతాను సీమోను పేతురును, చేటలో వేసి గోధుమలవలె జల్లించుటకు అనుమతిని కోరినప్పుడు క్రీస్తు తండ్రి యొక్క సముఖములో నిలబడి, పేతురు యొక్క నమ్మిక తప్పి పోకుండునట్లు పేతురు కొరకు వేడుకొనెను (లూకా. 22:31,32). తండ్రితో మాట్లాడిన యేసు, తరువాత పేతురు వద్ద: “నీవు మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము” అని చెప్పెను.

దేవుని బిడ్డలారా, మీ కొరకు తండ్రి యొక్క కుడిపార్శ్వమునందు బాధ్యతతో నిలబడి, విజ్ఞాపన చేయుచున్న క్రీస్తును చూడుడి.

నేటి ధ్యానమునకై: “వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారు వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమై యుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను” (యోహాను. 17:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.