అక్టోబరు 19 – మొదటిగా నీతి!
“మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకు అనుగ్రహింపబడును” (మత్తయి. 6:33).
మొదటిగా, ప్రభువును ముందు ఉంచుడి. ఆయన నీతిని వెదకి దాని కొరకు ప్రాముఖ్యతను ఇవ్వుడి, గొప్ప చేయుడి. మీరు దేవుని నీతిని వెదుకుచున్నప్పుడు, మీకు స్వస్థత, బలము, ఆరోగ్యము, సంపద, జ్ఞానము మొదలగునవి మీకు కలిపి ఇవ్వబడును.
ప్రతి దినమును ఉదయకాలమునందు లేచుచున్నప్పుడు నగుమోముతో, “నీతిగల ప్రభువా, నీకు స్తోత్రము” అని చెప్పి ఆయన యొక్క ముఖమును వెదకుడి. దినపత్రిక మరియు కాఫీ మొదలగు వాటిని వెదకకుండా దేవుని యొక్క రాజ్యము ఆయన యొక్క నీతిని వెదుకుటకు మిమ్ములను సమర్పించుకొనుడి.
ఇక్కడ ప్రభువు మొదటిగా నీతిని, తరువాత సమాధానమును, దాని తరువాత అనుసరించి, పరిశుద్ధ ఆత్మచేత కలుగుచున్న సంతోషమును చెప్పుచున్నాడు. అవును, నీతియు, సమాధానమును, సంతోషమును ఒకదానితో ఒకటి ఏకమైయున్నది.
మీరును నేనును వెళ్లి చేరేటువంటి పరలోక రాజ్యమును తేరి చూడుడి. అట్టి రాజ్యము నీతిచేత నిండియుండును. అన్యాయము చేయుచున్నవారైనను, నీతిని దొర్లించువారైనను ఏ ఒక్కరును అక్కడ కనబడరు. అపో. పేతురు అంత్యకాలములను గూర్చి వ్రాసి చివరిగా, “మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును” (2. పేతురు. 3:13) అని వ్రాయుచున్నాడు.
నిత్య రాజ్యములో ఉన్న క్రొత్త ఆకాశమైనను క్రొత్త భూమియైనను, స్పటికము వంటి సముద్రమైనను, నూతన యెరూషలేము అయినను సీయోను పర్వతమైనను, వాటియందు దేవుని యొక్క నీతి నివాసము ఉండును, పాపమే గాని, హేయమైనదేగాని, అక్కడ కనబడదు. నీతి గల దేవుడైయున్న ప్రభువు తానే అక్కడ ఏలుబడి చేయను.
అపో. యోహాను దర్శనమునందు నిత్యత్వమును చూచి వ్రాయుచున్నాడు: “మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీదకి ఎక్కి కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధమును జరిగించుచున్నాడు” (ప్రకటన. 19:11). మీ యొక్క కన్నులు అట్టి నీతిగల దేవున్నే తేరిచూచుచు ఉండవలెను.
యెషయా చెప్పుచున్నాడు, “శృంగారమైన పాగా ధరించు కొనిన పెండ్లికుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించు కొనిన పెండ్లికుమార్తె రీతిగాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది” (యెషయా. 61:10).
దేవుని బిడ్డలారా, మీరు రక్షింపబడి ప్రభువు యొక్క నీతికి మిమ్ములను సమర్పించుకున్నప్పుడు, ఆయన నీతి వస్త్రములను మీకు ధరింపజేసి, నీతియను పైబట్టల మీకు ధరింపజేయుచున్నాడు. పరలోకమునందు పరిశుద్ధల యొక్క నీతి వస్త్రమును ధరించుకొని, ప్రభువును మహిమపరచుదురు.
నేటి ధ్యానమునకై: “ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు” (ప్రకటన. 19:8).