సెప్టెంబర్ 20 – పూర్ణ హృదయముతోను!
“యెహోవా యొద్ద తమ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను … విచారణ చేయుదుము” (2. దినవృ. 15:12).
ఆసా అను రాజు ఇశ్రాయేలును ఏలుచున్నప్పుడు, అక్కడ ప్రభువును వెదకుటయందు ఒక గొప్ప ఉజ్జీవము కలిగెను. ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును తమ పూర్ణ హృదయముతోను, తమ పూర్ణాత్మతోను వెదకునట్లు తీర్మానించిరి. ప్రభువును వెదకనివాడు ఎవడో అతడు చంపబడవలెను అని ఒడంబడికను చేసిరి (2. దినవృ. 15:13).
ప్రభువును వెదుకుచున్నప్పుడు, అరకొరగా గాని, ఏదో ఇష్టము వచ్చినట్లుగాని గాక పూర్ణ హృదయముతో వెతకవలెను అనుటయే రాజైన ఆసా యొక్క ఆజ్ఞ. ఆసా అంటే వైద్యము చేయు వైద్యుడు అని అర్థము. ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒకే వైద్యము, “ప్రభువును పూర్ణ హృదయముతో వెదకవలెను” అనుటైయున్నది. యెహోవాను వెదకువారి హృదయమునందు సంతోషించుదురుగాక (కీర్తనలు. 105:3).
లోక ప్రకారమైన ఒక వైద్యుని వద్దకు వెళ్ళినట్లయితే, ఆయన: “హృదయమే మన జీవనాడికి ఆధారము. హృదయములో నుండియే శరీరమంతటికి రక్తము వెళ్ళుచున్నది. ఎలాగైతే మోటారు అమర్చబడిన ఒక పంపు బావిలో నుండి నీటిని పైకి తీసుకుని వచ్చుచున్నదో అలాగున, శరీరము లోని రక్తమును హృదయమే నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకును తీసుకొని వెళుచున్నది” అని చెప్పును. కొంతమంది యోగాసనను శిక్షణనుయిచ్చువారు, శీర్షాసనము అని చెప్పి తలక్రిందులుగా నిలబడుచున్నారు. అప్పుడే శిరస్సునకు చక్కగా రక్తము ప్రవహించును అనియు, నవ ఉత్తేజము కలుగును అనియు, ఆలోచన మండలము స్పష్టముగా ఉండును అనియు చెప్పుదురు.
అయితే బైబిలు గ్రంధము చెప్పుచున్న హృదయము అనేది రక్తప్రసర్నను తీసుకొని వచ్చుచున్న హృదయము కాదు. అది వాత్సల్యతయు, ప్రేమయు నివసించుచున్న నివాసస్థలము . ప్రభువును పూర్ణ హృదయముతో వెతకవలెను అని చెప్పుచున్నప్పుడు, ప్రేమతోను, వాత్సల్యముతోను, ఆప్యాయత రోషముతోను వెదకవలెను.
అవును, ప్రభువు మన యొక్క మెదడులో గాని, బుద్ధిలో గాని గాక శరీరములోని వేరు ఎట్టి భాగమునందు గాని నివసించుటలేదు. పూర్ణ హృదయముతో తనను ప్రేమించుచున్న హృదయములో ప్రభువు సంతోషముతో నివసించి, అట్టి హృదయమును ఆలయముగా చేసుకొనుచున్నాడు. అప్పుడు అట్టి హృదయము అతిపరిశుద్ధ స్థలముగా ఉండును.
రాజైన ఆసా తన పూర్ణ హృదయముతో ప్రభువును వెదుకుచున్నప్పుడు, ప్రభువు ఆయనకు ప్రత్యక్షమాయెను (2. దినవృ. 15:4). రాజైన ఆసా ప్రభువైయున్న దేవునిని వెదకుచునప్పుడు, చుట్టూతా ఉన్న శత్రువుల వలన ఎట్టి సమస్యయు రాలేదు. ప్రభువు సంపూర్ణమైన నెమ్మదిని ఆజ్ఞాపించెను (2. దినవృ. 14:7). మీ యొక్క జీవితములో సమస్యలును, పోరాటములును, శత్రువు యొక్క వ్యతిరేకతలును ఎదురవ్వుచున్నప్పుడు పూర్ణ హృదయముతో ప్రభువును వెదుకుటకు తీర్మానించుడి.
రాజైన యెహోషాపాతు ఉపవాసముతో ప్రభువును వెదికెను (2. దినవృ. 20:3). వేకువ జామునే దావీదు ప్రభువును వెదెకెను (కీర్తనలు. 63:1). మగ్దలేనే మరియ పెందలకడనే కన్నీటితో ప్రభువును వెదికెను (యోహాను. 20:1). దేవుని బిడ్డలారా, మీరు కూడాను ప్రభువును పూర్ణ హృదయముతో వెదుకుడి. అప్పుడు నిశ్చయముగా కనుగొందురు (మత్తయి.7:7).
నేటి ధ్యానమునకై: “మీరు యెహోవా పక్షపువారైన యెడల, ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనను వెదికిన యెడల, ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించిన యెడల, ఆయన మిమ్మును విసర్జించును” (2. దినవృ. 15:2).