సెప్టెంబర్ 21 – హృదయమును కలవరపడనియ్యకుడి!
“దావీదు సౌలుతో – ఈ ఫిలిష్తీయుని బట్టి యెవరి (మనస్సును) హృదయమును కలవరపడవలసిన అవసరము లేదు. మీ దాసుడనైన నేను పోయి, వానితో పోట్లాడుదునని అనగా” (1. సమూ. 17:32).
ఫిలిస్తీయ్యుల యోధుడైన గోలియాతు యొక్క ఆకారము ఇశ్రాయేలియులందరిని కలవరపరచెను. అయితే దావీదు అతనిని చూచి కలవరపడలేదు. అంత మాత్రమే కాదు ఇతరులను కూడా కలవరపడవద్దు అని చెప్పి నిబ్బరపరచువాడిగా దావీదు ఉండెను.
మనుష్యులుగా పుట్టిన ప్రతి ఒక్కరికిని కలవరములును, శ్రమలును, సమస్యలును, శోధనలును వచ్చుట సహజము. అయితే, దేవుని యొక్క బిడ్డలైయున్న మీరు కలవరపడు సమయములో సొమ్మసిల్లిపోకుండా, జెయమును పొందునట్లుగా పిలువబడియున్నారు. ఏ మనుష్యుడైతే తన యొక్క కన్నులను సమస్యల తట్టున చూడకుండా, ప్రభువు తట్టునే చూచుచున్నడో, అతడు జెయమును పొందువాడిగా ఉండును.
ఆనాడు సౌలును, అతని సైన్యపు యోధులందరును గోలియాతను అతి పెద్ద రాక్షసునిగా చూచిరి. అయితే దావీదు, ప్రభువును ముందు నిలబెట్టుకొనెను. అందుచేత గొలియాతును మిగుల చిన్నవానిగా చూచెను. ప్రభువు యొక్క సైన్యము తన పక్షమునందు నిలబడుటను చూచెను. ప్రభువు యొక్క నామములో తనకు జయము లభించును అని దిట్టముగా విశ్వసించెను. ప్రతిఫలమును గూర్చి తలంచకుండా, ప్రభువు యొక్క శక్తిని గూర్చియే తలంచెను.
దావీదు సొమ్మసిల్లిపోకుండా, ప్రభువు యొక్క నామములో విజయపు మాటలను పలికెను. అవి కేవలము విజయపు పలుకులుగా మాత్రముగాక, విశ్వాసపు మాటలుగాను సిద్ధించెను. “ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి, నీ తలను తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకనివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును” (1. సమూ. 17:46) అని చెప్పెను.
పలు రకములైన సమస్యలచేత మీ హృదయము కలత చెందుచున్నదా? ఈ లోకమునందు గల మనుష్యులు మీకు విరోధముగా లేచి నిలబడుచున్నారా? మీ ప్రాణ స్నేహితుడు మీకు విరోధముగా కుట్రను చేయుచున్నాడా? “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు” (యోహాను. 14:1) అని యేసు చెప్పియుండెను. “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?” (రోమీ. 8:31). “దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు?” (రోమీ. 8:33).
దేవుని బిడ్డలారా, ఇప్పుడే మీ సమస్యల వైపు చూచి: “లోకమును జయించిన యేసుని నామములో నేను నీకు విరోధముగా వచ్చుచున్నాను; నీ వలన నన్ను ఏమియు చేయలేవు. నాకు జయమును ఇచుచున్న దేవునికి స్తోత్రము” అని చెప్పుడి. అవి కుప్పకూలి పడిపోవుటను నిశ్చయముగా చూచెదరు. యేసుక్రీస్తుని నామమునందు గల శక్తి మీకు చాలినదైయున్నది.
నేటి ధ్యానమునకై: “నన్ను సింహము యొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడను విడిపించుననియు చెప్పెను” (2. సమూ. 17:37).