సెప్టెంబర్ 10 – లేఖన వాక్యము!
“దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు” (యోహాను. 10:10).
ఈ లోకమునందు దొంగ అనువాడు కష్టపడి శ్రమించి సంపాదించి దాచి పెట్టుకున్న వారి యొక్క ధనమును కత్తిని చూపించి సులువుగా లాగు కొనుచున్నాడు. సాతాను కూడాను ఒక దొంగయే. అతడు సంతోషమును దొంగిలించుచున్నాడు. సమాధానమును దొంగిలించుచున్నాడు. అన్నిటికంటే పైగా హృదయమునందు విత్తబడియున్న లేఖన వాక్యములను దొంగిలించుచున్నాడు.
సువార్తికులు వాక్యమను విత్తనమును విత్తుచుండగా, త్రోపక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేసేను (మత్తయి. 13:4). దీనిని గూర్చి యేసు వివరించి చెప్పుచు: “ఎవడైనను, రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, దుష్టుడు వచ్చి, వాని హృదయములో విత్తబడిన దానిని యెత్తికొని పోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే” (మత్తయి. 13:19) అని చెప్పెను.
మీ యొక్క హృదయమునందు విత్తబడియున్న ప్రభువు యొక్క వాక్యము ఆత్మీయు జీవమునైయున్నది. అట్టి విత్తనములు ముప్పదంతలుగాను, అరువదంతలుగాను నూరంతలుగాను, ఫలమును ఇవ్వదగినదైయున్నది. సాతాను వాక్యమును తీసివేయకుండునట్లు ప్రభువు యొక్క వాక్యమును మీ హృదయములో ఉంచుకొని కాపాడుకున్నట్లయితే, పరిశుద్ధ జీవితములో మీరు ముందుకు సాగి పోవుదురు.
లేఖన వాక్యములన్నియును పరిశుద్ధాత్ముని వలన అనుగ్రహింపబడినవి అవి అమూల్యమైనవి. “అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనవి” (కీర్తనలు. 19:10). “యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండియంత పవిత్రములు” (కీర్తనలు. 12:6). “వేలకొలది వెండి బంగారు నాణముల కంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు” (కీర్తనలు. 119:72).
మీరు దొంగ యొక్క చేతిలో పడకుండునట్లు జాగ్రత్తగలవారై ఉండవలెను. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిన మనుష్యుని అకస్మాత్తుగా దొంగలు అతనిపై దాడి చేసిరి. “అతని బట్టలను దోచుకొని, అతని కొట్టి గాయపరిచి, కొరప్రాణముతో విడిచిపోయిరి” (లూకా. 10:30).
చూడండి, ఆ మనుష్యుడు దొంగలను ఎదిరించలేదు. సాతానును ఎదిరించేటువంటి ఆత్మ ఖడ్గమును తీసుకుని, దొంగతో యుద్ధమును చేయలేదు. యేసును శోధించుటకు దొంగయైయున్న అపవాది వచ్చినప్పుడు, యేసు క్రీస్తు లేఖన వాక్యమైయున్న ఆత్మ ఖడ్గముతో సాతానును ఎదిరించి నిలబడి జయమును పొందెను. కావున. “దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి” (ఎఫేసి. 6:17).
“దేవుని యొక్క వాక్యము సజీవమై బలముగలదై, రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది” (హెబ్రీ. 4:12). దేవుని బిడ్డలారా, ఎంతకెంతకు లేఖన వాక్యమును చదివి, ధ్యానించి కంఠస్థము చేయగలరో అంతకంతకు చేయుడి. ప్రభువు యొక్క వాక్యమునకు ఎదుట సాతాను వలన నిలబడలేదు.
నేటి ధ్యానమునకై: “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైయున్నది” (కీర్తనలు. 119:105).