జూలై 28 – కుంచము క్రింద పెట్టక!
“దీపమును వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని, అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు” (మత్తయి. 5:15).
రక్షింపబడుచున్నప్పుడు ప్రభువు మీ యొక్క అంతరంగమునందు అట్టి అగ్నిమయమైన దీపమును వెలిగించును. కానీ ప్రభువు అనుగ్రహించిన రక్షణను, ఆయన కనపరచిన కృపను మీరు కప్పి పెట్టకూడదు. మీలో అణచి ఉంచకూడదు. ఇక్కడ కుంచము కింద కప్పి పెట్టుటను చూచుచున్నాము.
కుంచము అనుట వ్యాపారమును, వృత్తిని సూచించుచున్నది. నేడు అనేకులు ధనమును సంపాదించవలెను అను ఆశతో, వ్యాపారము వృత్తి అని రాత్రింబగళ్లు అలయుచు తిరుగుచున్నారు. బైబిలు గ్రంథమును పాఠించుటకు గాని, ప్రార్థించుటకు గాని, ఆరాధించుటకు గాని వారికి సమయము ఉండుట లేదు. కుంచము దీపమును కప్పి వేయచున్నది, మండుచున్న దీపమును ఆర్పివేయుచున్నది.
రెండోవదిగా, కుంచము అనుట కొలిచేటువంటి ఒక కొలపాత్రయైయున్నది. మీరు ధాన్యములను మిగతా అంశములను కొలచుట మంచిదే. కానీ సేవకులను, విశ్వాసులను కొలచి చూచి లోపాలను ఎత్తి చెప్పుచున్నప్పుడు, మీలో మండుచున్న దీపము ఆరిపోవును.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల?” (మత్తయి. 7:4). నేడు అనేక విశ్వాసులు తమ్మును సరిచేసు కొనుటను గూర్చి ఆలోచింపక, ఇతరులను పరిశీలించి, కొలచి, ఇష్టము వచ్చినట్లు మాట్లాడి తమ కృపను కోల్పోవుచున్నారు. “మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును” (మార్కు. 4:24) అని యేసుక్రీస్తు హెచ్చరించుచున్నాడు.
ఇతరుల వద్ద ఉన్న లోపములను కనుగొనుటను విడచి పెట్టుడి. నేరాలు మోపుటను విడచి పెట్టుడి. నోటి మాటలను ఎన్నడును ఖడ్గముగా వాడకుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడియున్నావు, నీ నోటి మాటల వలన పట్టబడియున్నావు” (సామెతలు. 6:2).
“మేమైతే మేరకు మించి అతిశయపడము గాని, మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము” (2. కోరింథీ. 10:13) అని అపో. పౌలు వ్రాయుచున్నాడు.
మీరు దీపమును కుంచము క్రింద పెట్టక దీపస్థంభము మీదనే పెట్టుడి. దీప స్తంభము అనుట క్రీస్తును సూచించుచున్నది. అప్పుడు మీ ఇల్లంతటికి వెలుగునిచ్చును. ఇల్లు అనుట వ్యక్తిగత రీతిలో మీయొక్క అంతరంగమును, ఆ తరువాత మీ యొక్క కుటుంబమును, సంఘమును సూచించుచున్నది. మీలో ఉన్న అగ్ని దీపమువలె మీరు వెళ్ళుచున్న సంఘము కూడాను ఉజ్జీవింపచేసి ప్రకాశింపచేయును.
దేవుని బిడ్డలారా, మీరు ఒక అగ్ని జ్వాలయైయుండుట వలన రగులుకొని మండుచు వ్యాపించుడి.
నేటి ధ్యానమునకై: “మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండ మీదనుండు పట్టణము మరుగైయుండ నేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు” (మత్తయి. 5:14,15).