ఆగస్టు 30 – సన్మానింపుము!
“నీకు మేలు కలుగునట్లును, నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు” (ఎఫెసీ. 6:2).
నీ తండ్రి నీ తల్లిని సన్మానించినట్లయితే నీకు భూసంబంధమైన జీవితములో మేలు కలుగుటతోపాటు, నీవు జీవించు దినములు దీర్ఘాయిష్షైయుండును అని ప్రభువు దిట్టముగాను, స్పష్టముగాను చెప్పుచున్నాడు.
పది ఆజ్ఞలను మనము రెండు భాగములుగా విభజించవచ్చును. మొదటి భాగము మనుష్యునికిని దేవునికిని మధ్యగల సంబంధమును గూర్చిన భాగము. ఆ తరువాతది మనుష్యునికిని, మనుష్యునికిని మధ్యగల సత్సంబంధమును గూర్చిన భాగము. మొదటిగా, మీరు మీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ప్రాణముతోను ప్రభువును ప్రేమించవలెను. రెండవది, మిమ్ములను ప్రేమించుచున్న ప్రకారము మీ పొరుగువారిని ప్రేమించవలెను.
మీయొక్క వృద్ధాప్యపు దినములలో మీ పిల్లలు మిమ్ములను ఎలాగూ గమనించవలెనని మీరు ఎదురుచూచున్నారో, అదే ప్రకారముగా వృద్ధులైన మీయొక్క తల్లిదండ్రులను మీరు గమనించి, సన్మానించవలెను. తండ్రియు తల్లియు మహా గొప్ప ఆశీర్వాదములు. వారు మిమ్ములను కన్నది మొదలుకొని, పెద్ద చేసేవరకును ఎన్నో త్యాగములను చేసియున్నారు. మీరు వ్యాధిన పడిన సమయములంతా కంటి పై రెప్పవేయక మేల్కొనియుండి కాపాడుచున్నారు. ప్రభువు తర్వాత సన్మానింప బడవలసినవారు ఈ భూమిమీద ఎవరైనా ఉన్నారు అంటే అది తండ్రియు, తల్లియు మాత్రమే.
అపో. పౌలు తిమోతికి: “వీరు మొదట తమ యింటివారి యెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది మేలుకరమైనదియు దేవుని దృష్టికి అనుకూలమైనదైయున్నది” (1. తిమోతి. 5:4) అని వ్రాయుచున్నాడు.
తల్లిదండ్రులను సన్మానించుట అంటే, ప్రతినెల కొంత ధనమును పంపించుట అనుటకాదు. వరస్సుమల్లిన దినములలో వారికి ఆప్యాయతయు, ప్రేమయు కావలెను. వారి యొక్క ఆరోగ్యమును గూర్చియు, అనునిత్యవసరములను గూర్చియు ప్రేమతో పట్టించుకొనవలసినది పిల్లల యొక్క బాధ్యత. “పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునకు (బట్టి మెచ్చుకొనతగినది) ప్రీతికరమైనది” (కొల స్సి. 3:20) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
నిర్గమకాండపు గ్రంథములో ఇంకా దానిని వివరించుటకు ప్రభువు సూచించుచున్నాడు. “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగుట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” (నిర్గమ. 20:12). “తన తండ్రినైనను తన తల్లినైనను (నిర్లక్ష్యము చేయువాడు) దూషించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను” (ద్వితి. 27:16).
ప్రభువు మీ ఎదుట ఆశీర్వాదమును, శాపమును పెట్టుచున్నాడు. జీవమును మరణమును మీ ఎదుట ఉంచుచున్నాడు. జీవమును ఎంచుకొనుడి, ఆశీర్వాదమును ఎంచుకొనుడి. దేవుని బిడ్డలారా, మీ తండ్రిని, తల్లిని సన్మానించి, ప్రేమించి, వాత్సల్యతను చూపించుచున్నప్పుడు, నిశ్చయముగానే ప్రభువు మీకు దీర్ఘాయుష్షును అనుగ్రహించి ఆశీర్వదించును.
నేటి ధ్యానమునకై: “నాశనము (సమాధి)లోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు” (కీర్తనలు. 103:4,5).