ఆగస్టు 16 – హృదయమును ఇయ్యుడి!
“నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము; నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము” (సామెతలు. 23:26).
ప్రభువు మనుష్యుని కొరకే, సమస్తమును సృష్టించెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములన్నియును దేవుడు మనుష్యునికి అనుగ్రహించిన గొప్ప ఈవులైయున్నవి. కొండలు, గొట్టలు, లోయలు, వృక్షములు, చెట్టులు మొదలగునవి ఆయన యొక్క వాత్సల్యపు బహుమతులే. విధవిధములైన ఆహారపు వంటకాలును, కాలముల స్థితిగతులను ఆయన మనుష్యునికి దయతో ఏర్పరచి అనుగ్రహించెను. అతడు భూమి మీద జీవించుటకు బహు చక్కని శరీరమును, వివేకముగల లోకముతో సంప్రదించుటకు ప్రాణమును, పరలోకముతో సహవాసము కలిగియుండుటకు ఆత్మను అనుగ్రహించెను.
మనుష్యుడు పాపమును చేసినప్పుడు, పాపమును బాపుటకు తన యొక్క రక్తమునే దయచేసెను. శరీరమునంతటిని చీల్చి వేయుటకు అప్పగించుకొనెను. వ్యాధులను స్వస్థపరచుటకు సంకల్పించెను. ప్రేమను అనుగ్రహించెను, సమాధానమును అనుగ్రహించెను, సంతోషమును అనుగ్రహించెను, సిలువపై తనను సమర్పించుకొని అనుగ్రహించెను. సమస్తమును అనుగ్రహించిన ఆయన ఒక దానిని మాత్రమే మన వద్ద అడుగుచున్నాడు. అదియే మన యొక్క హృదయము.
మన యొక్క పూర్ణ హృదయమును ఆయనకు ఇచ్చుచున్నప్పుడు. సంతోషముగా ఆయన వచ్చి మన యొక్క హృదయమును తన యొక్క ఆలయముగా మార్చుకొని, లోపల నివాసముండును. మన యొక్క దేవుడైయుండును. మనము ఆయన యొక్క ప్రజలమైయుందుము.
జనులు తమ యొక్క హృదయమును ప్రభువునకు ఇవ్వకుండా, పెదవులతో ఆరాధన చేయుచు నామకార్థపు క్రైస్తవులుగా ఉండుట ఎంతటి దుఃఖకరమైన ఒక అంశము! “ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు, తమ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని; తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు” (యెషయా. 29:13) అని యేసుక్రీస్తు మనస్సునందు నొచ్చుకున్నవాడై చెప్పుచున్నాడు.
మీరు మీ హృదయమును ప్రభువునకు ఇచ్చినట్లయితే, ఆయన మీ హృదయమును పవిత్రపరచి, పరిశుద్ధపరచును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” (మత్తయి. 5:8).
ప్రభువు మీకు సౌఖ్యమును, బలమును, జ్ఞానమును దయచేసియున్నందున, మీరు మీ రాబడి అంతటిలో దశమ భాగమును ఆయనకు కానుకగా ఇవ్వవలసినవారిగా ఉన్నారు. అలాగన మీరు మనఃపూర్వకముగా ఇచ్చుచున్నప్పుడు ప్రభువు పరలోకము యొక్క వాకిండ్లను తెరచి, పట్టజాలనంతగా మిమ్ములను ఆశీర్వదించును (మలకీ. 3:10) అనియు, వెయ్యి రెట్లు నిన్ను ఆశీర్వదించును (ద్వితీ. 1:11) అనియు బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
దశమ భాగపు కానుక మాత్రము గాక, మీ యొక్క సమయమును ప్రభువునకు ఇవ్వుడి. ఇరవై నాలుగు గంటల సమయమును ఆయన మీకు ఇచ్చి ఉండగా ఒక గంట సమయమునైనను మీరు ఆయనతో మేలుకొని ఉండకూడదా? ఆయనను ప్రేమించుటకును, స్తుతించుటకును, పాడుటకును, మహిమ పరచుటకును, పరిచర్యను చేయుటకును, మీ సమయమును ఆయనకు ఇయ్యుడి.
నేటి ధ్యానమునకై: “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతను, మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును” (లూకా. 6:38).