అక్టోబరు 07 – చూడుడి! చూడుడి!”
“ఆకాశపక్షులను గమనించి చూడుడి” (మత్తయి. 6:26).
చూడుడి, చూడుడి, గమనించి చూడుడి అని ప్రభువు ప్రేమతో పిలుచుచున్నాడు. సాధారణముగా చూచుటకును, గమనించి చూచుటకును మిగుల గొప్ప వ్యత్యాసములు కలదు. పైపై తేటగా చూచుచున్నప్పుడు, అనేక సూక్ష్మములను రహస్యములను మనము తెలుసుకుకొనలేక పోవుచున్నాము. అయితే గమనించి, పరిశీలించి చూచుచున్నప్పుడు, పలు సత్యములను తెలుసుకొనగలము.
మొట్టమొదటిగా, ఆకాశపు పక్షులను గమనించి చూడుడి (మత్తయి.6:26) అనియు, రెండోవదిగా, అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో గమనించి ఆలోచించి చూడుడి (మత్తయి. 6:28) అనియు, మూడోవదిగా, క్రీస్తు యేసును (మీద లక్ష్యము) గమనించి చూడుడి (హెబ్రీ. 3:1) అనియు ప్రభువు మూడు అంశములను ప్రాముఖ్యముగా గమనించి చూచునట్లుగా చెప్పుచున్నాడు.
నాలుగు నెలలుగా ఇంటి అద్దె ఇవ్వలేదే ఏమి చేయుట అని కలత చెందుచు ఒక విశ్వాసి వెళ్ళుచు ఉండెను. వెళ్ళుచున్న దారిలో చెత్త కుండీలో ఒక కాకి చనిపోయి ఉండుటయు, మిగతా కాకులు చుట్టూతా నిలబడి కావ్ కావ్ మని కేకలు పెట్టుటయు చూచెను. చనిపోయిన ఆ కాకిని గమనించి చూచినప్పుడు, దాని నోరు తెరువబడి ఉండుటను చూచెను. అప్పుడు ఆ కాకి యొక్క నోటి లోపల ఒక బంగారపు ఉంగరము చిక్కుకొని ఉండుటను చూచెను. దానిని తీసికొని అమ్మి, ఆ ధనము ద్వారా ఇంటి అద్ది బకాయిని చెల్లించి సమాధానముతో జీవించు చుండెను.
కాకి తెగ నేడును మన చుట్టూతా ఎగురుచు ఏలియా యొక్క దేవుడు నేడును దీవించుచున్న వాడైయున్నాడు అని మనకు తెలియజేయుచునే ఉన్నది. కాకులు మారిపోలేదు, మనమే కాకులను గమనించి చూచుటకు తప్పిపోయాము. ఏలియాను పోషించుటకు కాకిని వాడిన ప్రభువు నేడును మారనివాడైయున్నాడు. “కాకుల సంగతిని విచారించి గమనించి చూడుడి, ….. దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు” (లూకా. 12:24).
అడవి మంటలచేత కాలిపోయిన ప్రదేశము గుండా ఒక భక్తుడు వెళ్ళుచున్నప్పుడు, అక్కడ కాలిపోయి చనిపోయియున్న ఒక కోడిని, దాని రెక్కల క్రింద ప్రాణాలతో ఉన్న అనేక కోడి పిల్లలను చూచెను. ఆ అడవిలో మంటలు రగులుకొని మండుచునప్పుడు, ఈ కోడి తన పిల్లలను కాపాడుట కొరకు తన రెక్కల చేత కప్పుకొని అలాగునే కూర్చుండిపోయెను. అది తప్పించుకొనుటకు తలంచి ఉన్నట్లయితే పారిపోయి గాని, ఎగిరిపోయి గాని తప్పించుకొని ఉండగలదు. అయితే కోడి పిల్లలపై ఉంచిన ఆప్యాయతను బట్టి తన ప్రాణమునే త్యాగము చేసి కోడి పిల్లలను కాపాడెను.
యేసు యెరూషలేమును చూచి: “యెరూషలేమా, యెరూషలేమా, …. కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చు కొనవలెనని యుంటిని” అని చెప్పి కన్నీటిని చిందించెను (మత్తయి. 23:37).
దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను కాపాడుటకు ఎంతగానో తన యొక్క రెక్కలను చాపియున్నాడు! ఎంతగానో వాత్సల్యతను చూపి జాలి పడుచున్నాడు! మహోన్నతుని చాటునకును, సర్వశక్తుని నీడకును తరలి రండి.
నేటి ధ్యానమునకై: “ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును; ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును; ఆయన సత్యము కేడెమును, డాలునైయున్నది” (కీర్తనలు. 91:4).