Appam, Appam - Telugu

ఆగస్టు 01 – నూతన మాసము!

“ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము; యెహోవా, దయచేసి నన్ను రక్షించుము; యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము” (కీర్తనలు. 118:24,25).

ఈ సంవత్సరమునందు ఏడు మాసములను విజయవంతముగా దాటుకొని, ఆగస్టు మాసము మొదటి దినమును చూచుటకు ప్రభువు కృపను అనుగ్రహించెను. ఇది యెహోవా కలుగజేసిన దినము; దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ఈ మాసము మీకు దేవుని ప్రసన్నతచేత నింపబడి ఉత్సహించేటువంటి ఒక మాసముగాను, విజయపు నడకను వేసి ముందుకు సాగేటువంటి ఒక అంశముగా ఉండవలెను.

మీ యొక్క కాలములు ప్రభువు యొక్క హస్తములో ఉన్నాయి. ప్రతి ఒక్క దినమును ప్రభువు యొక్క హస్తములోనికి సమర్పించుకొని, ‘దేవా, నీ ప్రసన్నత నాకు ముందుగా వెళ్ళవలెను. నీవు నన్ను ప్రేమతో త్రోవ నడిపించుము’ అని ప్రార్థించుడి. మీయొక్క భారములను చింతలను ఆయనపై మోపివేసి, ఆయన వాటి నుండి విడిపించును అని విశ్వసించినట్లైతే, ఆయన నిశ్చయముగానే మిమ్ములను చెయ్యి పట్టి నడిపించును.

“కావున, రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును” (మత్తయి. 6:34). ప్రతి దినమునకును తన సూర్యోదయమును, సూర్యుని వెలుగును ఉండునట్లుగా, ప్రభువు యొక్క కృపయు ప్రతి దినమును నూతనముగా ఉండును (విలా. 3:22,23).

ప్రతి దినమును దేవునితో ప్రారంభించి, సమయము దొరుకునప్పుడెల్లను ఆయనను స్తోత్రించుచునే ఉండుడి. దావీదు రాజు ఒక దినమునకు ఏడుసార్లు ప్రభువును స్తుతించెను. “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను; ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను” (కీర్తనలు. 16:8).

ప్రతి దినము యొక్క సమస్యలును, పోరాటములును, బాధ్యతలును మీ యొక్క జీవితము అను రధమును లాగుచున్న గుర్రమువలె ఉండవచ్చును. కానీ మీ యొక్క జీవితమును త్రోవ నడిపించుకుని వెళ్ళువాడు ప్రభువు. ప్రభువు తనే మిమ్ములను భద్రతతోను, ప్రార్థనతోను నడిపించును గాక!

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము; ఆయన వారిని నశింపజేసి; నీ యెదుట వారిని కూలద్రోయును” (ద్వితి. 9:3).

ఈ మాసము అంతయును మీకు ఆశీర్వాదముగా ఉండునట్లు దైవ చిత్తమునకు మిమ్ములను సమర్పించుకొనుడి. మీరు దేవుని చిత్తములోనే ఉన్నారా అను సంగతిని అప్పుడప్పుడు దృఢపరచుకొనుడి.

మిమ్ములను గూర్చి ప్రభువునకు ఒక శాశ్వతమైన ఉద్దేశమును, ప్రణాళికయు, తీర్మాణమును కలదు. మీరు ఆయన కుమారుని యొక్క పోలికకు సమానముగా ఉండునట్లు, ప్రభువు మిమ్మును గూర్చి అతిపెద్ద ఉద్దేశమును కలిగియున్నాడు (రోమీ. 8:29). ప్రభువు ఎల్లప్పుడును మీకు మేలునే చేయును.

దేవుని బిడ్డలారా, మనుష్యులు కీడును చేయుటకు ముందుకు రావచ్చును. కానీ ప్రభువు అట్టి కీడును మేలుగా మార్చి మిమ్ములను ఆశీర్వదించును.

నేటి ధ్యానమునకై: “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము” (రోమీ. 8:28).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.