జూలై 22 – ఒక విందు!
“ఇదిగో, నా విందు సిద్ధపరచియున్నాను; నా ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడినవారితో చెప్పుడని దాసులను పంపెను” (మత్తయి. 22:4).
ప్రభువు తన యొక్క జనాంగము కొరకు సిద్ధపరచుచున్న అనేక అంశములను ఒక్కొక్కదానిగా ధ్యానించుచు వచ్చుచున్నాము. అలా సిద్ధపరచుచున్న వాటిలో ఒకటి విందు. ప్రభువు మీకును, నాకును మధ్యాకాశమునందు ఒక పరలోక విందును సిద్ధపరిచియున్నాడు.
“గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చియున్నది,ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము. గొఱ్ఱెపిల్లయైనవాని పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము” (ప్రకటన. 19:7,9).
బైబులు గ్రంధము సెలవిచ్చుచున్నది: “ఈ పర్వతము మీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును; మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును, మూలుగుగల క్రొవ్విన వాటితో విందుచేయును, మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును” (యెషయా. 25:6).
మనము మన ప్రాణ ప్రియుడైన వరుడగు క్రీస్తుతో, ఆయనకు సొంతమైయున్న వధువుగా ఆయనతో కూడా కూర్చుందుము. ప్రభువు రాజాది రాజుగాను, ప్రభువుల ప్రభువుగా కిరీటమును ధరించుకొనియుండును! అక్కడ “దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపని” (ప.గీ. 3:10). ఆటలును, పాటలును, స్తుతులును ఆనందముతో కూడిన ఆర్బాటమును మాటలతో వర్ణించలేనంతగా రమ్యముగా ఉండును.
బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నవ్వులాటలు పుట్టించుటకై వారు విందుచేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము” (ప్రసంగి. 10:19). భూమి మీద శ్రమను అనుభవించిన పరిశుధ్ధులు, కన్నీటితో సువార్త విత్తనములను విత్తిన దైవ సేవకుల యొక్క సంతోషము కొరకు ప్రభువు ఇట్టి విందును సిద్ధపరిచియున్నాడు.
అవును, ఇకమీదట వారికి శ్రమలును, బాధలును లేదు. ప్రభువు సిద్ధపరుచుచున్న విందులో ఆయనతో కూడా విందు చేయుచునప్పుడు చింతలు అన్నియును మరచిపోవును. “అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను; నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను” (ప.గీ. 2:4).
లోకస్తులు అల్లరితో కూడిన ఆటలకును, తాగుడు మత్తునకును, సంబరాలకును పలు రకములైన విందులను సిద్ధపరచుదురు. అయితే, ప్రభువు సిద్ధపరచుచున్న విందులో పరిశుద్ధులు మాత్రమే పాలు పొందుదురు. ఎట్టి పాపియు అక్కడ రాలేదు.
దేవుని బిడ్డలారా, మీరు అట్టి మహిమకరమైన విందులో పాలు పొందుటకు మిమ్ములను ఎంతగా అర్హతగలవారిగా ఉంచుకొనవలెను! రక్షణ వస్త్రము ధరించి, నీతియను వస్త్రమును ధరించి, పాత నిబంధన, కొత్త నిబంధన పరిశుద్ధులతో కలసి మనస్సునందు ఆనందముతో ఉల్లసించుటకు ఎంతగా మిమ్ములను అర్హతగలవారిగా ఉంచుకొనవలెను! అట్టి దినము సమీపించియున్నది
నేటి ధ్యానమునకై: “సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. పగవాని యింట క్రొవ్విన యెద్దు మాంసము తినుట కంటె ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు” (సామెతలు. 15:15,17).