జూలై 17 నేడే గొప్ప చేయుదును!
“యెహోవా యెహోషువతో ఇట్లనెను: నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు, నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను” (యెహోషువ. 3:7).
నేడు మిమ్ములను గొప్ప చేయుదును అని ప్రభువు వైరాగ్యముతో చెప్పుచున్నాడు. ప్రభువు మిమ్ములను హెచ్చించి గొప్ప చేయుచున్నప్పుడు ఎట్టి మనుష్యుడైనను మిమ్ములను అణచివేసి కించపరచలేడు. ప్రభువు దయచేయుచున్న గొప్పతనము నిరంతరమైనదియు, గొప్ప ఔన్నత్యమైనదైయున్నది.
మోషే తరువాత ప్రభువు యెహోషువను ఏర్పరచుకొని గొప్ప బాధ్యతను ఆయన చేతులకు అప్పగించెను. ఇశ్రాయేలు ప్రజలను త్రోవ నడిపించు బాధ్యత, కనానునందుగల రాజులకును జనాంగములకును విరోధముగా యుద్ధము చేయవలసిన బాధ్యత, దేశమును జనులకు పంచి ఇచ్చేటువంటి బాధ్యత అని పలు బాధ్యతలు ఆయనకు ఇవ్వబడెను. ‘ఎలాగు నేను దీనిని చేసి ముగించెదను? జనులైయితే తిరుగుబాటు చేయువారును, సణుగేటువంటి జనులైయున్నారే. వారు ఎలాగున నాకు లోబడియుందురు?’ అని కలతచెందుచున్న యెహోషువాను ప్రభువు జాలితో తేరి చూచి, “నిన్ను గొప్ప చేయుదును” అని చెప్పెను.
ఆయన చెప్పినట్లుగానే ఆనాడు గొప్పచేసెను. అవును, ప్రభువు మిమ్ములను కూడాను హెచ్చించుటకును గొప్పచేయుటకును సంకల్పించియున్నాడు. అది బహుశా ఒక పదవి హెచ్చింపుగా ఉండవచ్చును. లేక కొత్త బాధ్యతలను, విధులను మీకు ఇవ్వవచ్చును. ప్రభువు యొక్క కన్నులలో మీకు కటాక్షము దొరికియున్నందున ఆ సంగతిని నేడే జరిగించును.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఎవరినైనను హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవలన అవును” (1. దినవృ. 29:12). అయితే మనము చేయవలసిన అంశము ఒకటి కలదు. ఆయన బలమైన హస్తములో తగ్గింపుతో అనిగి మెనికి ఉండుటయే అది.
మరియు, “ఆయన ఆజ్ఞలనన్నిటిని విని అనుసరించి నడుచుకొనినయెడల, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును” (ద్వితీ. 28:1) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. కొందరిని ప్రభువు గొప్ప చేయుచున్నప్పుడు, మనస్సునందు గర్వించుచున్నారు. నెబుకద్నేజరునకు ప్రభువు ఘనతను మహిమను ఔనత్యమును ఇచ్చినప్పుడు, ఆయన తన్ను తాను తగ్గించుకొనకుండా గర్వించెను.
బబులోనులోని రాజనగరునందు సంచరించుచు, “బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా: రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్ద నుండి తొలగిపోయెను. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు” (దాని. 4:30-32) అని సెలవిచ్చెను. గర్వము కారణముగా ఆయన వెంటనే మనుష్యుల యొద్ద నుండి త్రోయబడి మృగమువలె ఆయెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు ముందుగానే మిమ్ములను గొప్ప చేసియున్నాడు. ఆయన ఎదుట మీరు తగ్గింపుతో నడుచుకొనుడి.
నేటి ధ్యానమునకై: “భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు” (జెఫన్యా. 3:20).