ఆగస్టు 21 – చిల్లు సంచి!
“మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను; మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది; పానము చేయుచున్నను దాహము తీరకయున్నది; బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది; పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము (చినిగిపోయిన) చిల్లు సంచిలో వేసినట్టుగా ఉన్నది” (హగ్గయి. 1:6).
ప్రవక్తయైన హగ్గయి పలు గుంపుల వారిని మన మనో నేత్రములకు ముందు తీసుకొని వచ్చుచున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఒక రైతును ముందు పెట్టుచున్నాడు. ఆ రైతు అత్యధికముగా విత్తినను ఫలితము దొరకలేదు. బహు కొంచెము పంటనే కోసుకుని వచ్చుచున్నాడు. ఎందుకని ఆ రైతు యొక్క నేల ఇతరుల వలె ముప్పదంతులు, అరువదంతులు నూరంతులు ఫలితమును ఇవ్వలేదు? ఎందుకని ఆయన సంచికి చిల్లు పడియున్నది?
మరొక్క గుంపు వారిని కూడాను ఆయన మనోనేత్రములకు ముందుగా నిలబెట్టుచున్నాడు. వారి వద్ద ధనమున్నది, వారు ఎంతగా భుజించినను వారికి ఆకలి తీరకయున్నది. వారి పొట్టలో ఏదో ఒక దుష్ట ఆత్మ నివాసంముంటూ ఆకలిని పుట్టించుచూనేయున్నది. వారి యొక్క ప్రాణములో నిమ్మదియు, సమాధానమును లేదు. వీరు కలిగియుండేది కూడాను ఒక చిల్లు సంచియే.
మరొక్క గుంపును కూడాను ఆయన మన ముందు నిలబెట్టుచున్నాడు. వారు ఎన్నో వస్త్రములను ధరించియుండియు, కంబలి కప్పుకునియుండినను వారికి చలి ఆగకున్నది. శరీరము వణుకుచూనే ఉండెను. ఇది కూడాను ఒక రకమైన చిల్లు సంచియే.
హగ్గయి ప్రవక్త చెప్పుచున్నాడు, ప్రభువు యొక్క మందిరము పాడైయుండగా, మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుచున్నారు. మీయొక్క క్రియలే ఆ సంచులకు చిల్లును కలుగజేసియున్నది. చిల్లు సంచిలో సొమ్ములు నిలిచి ఉండదు. చిల్లువలలో చాపలు ఉండవు. పడిపోయియున్న బలిపీఠముపై అగ్ని దిగిరాదు. ఆలయమును నిర్లక్ష్యము పెట్టువారి యొక్క జీవితములో ఆశీర్వాదము ఉండదు.
మీరు ప్రభువును ఘనపరచుచున్నప్పుడు, ఆయన మిమ్ములను ఘనపరచును. ప్రభువునకు ప్రాముఖ్యతను ఇచ్చుచున్నప్పుడు, ఆయన మిమ్ములను బహు గొప్ప ఔన్నత్యమైన స్థితియందు ఉంచును. ప్రభువు యొక్క ఆలయమునకు మీ యొక్క దశమ భాగములను తీసుకుని వచ్చున్నప్పుడు, ఆకాశము యొక్క వాకిండ్లను తెరచి, పట్టజాలనంతగా మీపై ఆశీర్వాదమును వర్షింపచేయును (మలాకీ. 3:10). “నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును; నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును” (సామెతలు. 3:9,10).
దేవుని బిడ్డలారా, ‘మొదటిగా ప్రభువునకు’ అను సంగతిని బహు బలముగా మీ యొక్క హృదయపు పలకపై వ్రాసి ఉంచుకొనుడి. ప్రభువును నిజముగా ప్రేమించుచున్నప్పుడు మనఃపూర్వకముగా మీకు లభించుచున్న వాటన్నిటిలో నుండి ప్రభువునకు ప్రధమ భాగమును ఇచ్చి ఆయనను సంతోషింప చేయుదురా? అప్పుడు ఆయన మిమ్ములను సంతోషింప చేయును. తన యొక్క మహిమైశ్వర్యము చొప్పున, మీ యొక్క అవసరములన్నిటిని నెరవేర్చును. మీ యొక్క పాత్ర ఎల్లప్పుడును నిండి పొర్లుచునే ఉండును.
నేటి ధ్యానమునకై: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియును మీకు అనుగ్రహింపబడును” (మత్తయి. 6:33).