అక్టోబరు 15 – నీతిమంతుడు!
“నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము” (ప్రకటన. 22:11).
బైబిలు గ్రంథము యొక్క చివరి అధ్యాయమైయున్న ప్రకటన. 22 లో ప్రభువు నీతిని గూర్చియు, పరిశుద్ధతను గూర్చియు అత్యధికముగా నొక్కి ఒక్కనించియున్నాడు. అవును, రాకడలో కనబడుటకు ఒక మనుష్యుని యొక్క జీవితములో నీతియు, పరిశుద్ధతయు మిగుల అవశ్యము.
“నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము; పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను” (ప్రకటన. 22:11,12) అని యేసుక్రీస్తు చెప్పుచున్నాడు.
మీ యొక్క నీతికిని, పరిశుద్ధతకును తగు ప్రతిఫలమును క్రీస్తు వచ్చుచున్నప్పుడు, నిశ్చయముగానే పొందుకొందురు. ప్రతి దినమును నీతిమీదను, పరిశుద్ధతమీదను దప్పికతో ఉండి, ఇంకను పరిశుద్ధత చెందవలెను, ఇంకను నీతిని చెయవలెను అను తపనతో ముందుకు సాగిపోవుడి.
ఒక అడివిలో బహువేగముగా పరిగెత్తేటువంటి ఒక దుప్పి ఉండెను. అడవినందు గల ఏ మృగమును ఆ దుప్పికి సాటిగా వేగమునందు పరిగెత్తలేదు. అయితే ఒక దినమున ఒక కప్ప ఆ దుప్పికి వేగముగా పరిగెత్తుటను గూర్చి సవాలు విడిచెను. ‘అడవి మృగములన్నియు సమావేశమైయుండగా పరుగు పందెము ప్రారంభించెను. దుప్పి మిగుల వేగవంతముగా పరిగెత్తుటకు ప్రారంభించినప్పుడు, కప్ప అమాంతముగా దూకి దుప్పి యొక్క వీపునకు హత్తుకుపోయెను.
దుప్పికి ఈ సంగతి తెలియలేదు. తన యొక్క గురిని చేరుటకు ముందుగా ఎంత వరకు కప్ప వచ్చియున్నది అని దుప్పి తిరిగి తిరిగి చూచెను. అదే తగిన సమయము అని కప్ప దుప్పి యొక్క వీపి మీద నుండి వేగముగా దూకి, గురి యొక్క గీతను ముట్టి విజయము పొందెను.
మీరు ఒకటి చేయుడి. మీ యొక్క స్వనీతిని మరచి, క్రీస్తు యొక్క నీతిని మీతో ఏకము చేసుకొనుడి. ఆయన ఈ లోకములో నీతిమంతుడిగా ఉండి, నీతి క్రియలను చేసి, నీతి న్యాయములను స్థిరపరచి, తన యొక్క పరుగును విజయవంతముగా పరిగెత్తి ముగించెను.
పాత నిబంధన యొక్క పరిశుద్ధులందరును తమ యొక్క స్వనీతిని నమ్మి, ధర్మశాస్త్రము యొక్క నీతిని ఆశ్రయించి పరిగెత్తిరి. వారు ఎంతగా పరిగెత్తినను, వారి యొక్క స్వనీతి దేవుని నీతి యొక్క స్థాయికి వచ్చి చేరలేదు. అయితే మనము, స్వనీతిని ఆశ్రయించక, క్రీస్తు యొక్క నీతినే ఆశ్రయించుచున్నాము. ఆయనతోనే ఏకమైయున్నాము. ఆయన మిమ్ములను నీతిమంతులుగా చేసి తన యొక్క నీతిని మీకు ధరింపజేసియున్నాడు. కావున మీయొక్క పరుగు విజయవంతముగా ముగియును.
క్రీస్తు యొక్క నీతిని ధరించుకున్న అపో. పౌలు తన పరుగు యొక్క చివరిలో: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ” 2. తిమోతికి. 4:7,8) అని చెప్పెను.
అసంఖ్యాకులైన క్రీస్తు యొక్క పరిశుద్ధులు కూడాను స్వనీతిని నెరవేర్చి నీతిమంతులుగా తమ పరుగును ముగించియున్నారు. అట్టివారు ఉంచి వెళ్లిన అడుగు జాడలను చరిత్రలో మనము చూచుచున్నాము. మీ యొక్క పరుగు విజయవంతముగా ముగియునట్లు ప్రభువు మీకు సహాయము చేయును. క్రీస్తు యొక్క నీతిని ఆశ్రయించుడి.
నేటి ధ్యానమునకై: “నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి; నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను” (కీర్తనలు. 118:19).