Appam, Appam - Telugu

సెప్టెంబర్ 29 – కపటములేని జీవితము!

“యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి అతనిని గూర్చి: ఇదిగో, యితడు నిజముగా కపటము లేని ఇశ్రాయేలీయుడు, ….. అని చెప్పేను” (యోహాను. 1:47).

నతనయేలు యేసు యొక్క ప్రారంభ శిష్యులలో ఒకడు. యోహాను వ్రాసిన సువార్తలో ఇతని పేరు నతనయేలు అనియు మిగతా సువార్తలలో బర్తొలొమయి అనియు చెప్పబడియున్నది (మత్తయి. 10:3; మార్కు. 3:18). మొట్టమొదట నతనయేలును క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చినది ఫిలిపు అనువాడైయున్నాడు (యోహాను. 1:45).

యేసుక్రీస్తు, నతనయేలును గూర్చి ఎంత చక్కగా సాక్ష్యమును ఇచ్చెను! నిజముగా కపటము లేని ఇశ్రాయేలీయుడు అనుటయే ఆయన యొక్క సాక్ష్యము. “డాగుముడత లేని, నిష్కపటమైన, నిజమైన దేవుని యొక్క బిడ్డ. లోపట ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడని బుద్ధిగల ఇశ్రాయేలీయుడు” అని ఆయన చెప్పెను. “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” (1. సమూ. 16:7). ఆయన హృదయాంతరంగములను పరిశీలించి చూచువాడు.

అనేకులు నిష్కపటమైన నిజమైన జీవితమును జీవించుటలేదు. వేషధారణులై జీవించుచు, మాయను ధరించుచున్నారు. వంచనతో మాట్లాడుచున్నారు. ఇస్కరియోతు యూదా మూడు సంవత్సరములకు పైగా క్రీస్తును వెంబడించుచు వచ్చినప్పటికీని, అతని యొక్క అంతరంగములో కపటమును, వంచనయే నిండియుండెను.

యేసునకు ముద్దు పెట్టినను, అది ఆయనను పట్టి ఇచుటకు ఆనవాలుగానే ఉండెను. ఆ సంగతినే మనము కపటము అని చెప్పుచున్నాము. హృదయమునందు వంచనను పెట్టుకొని యూదా మంచివాని వలెను, ఆప్యాయత గల వాని వలెను, స్నేహపూరితమైన జీవితమును జీవించెను. అయ్యో! యూదా యొక్క అంతము దౌర్భాగ్యముగా ముగిసెను.

“పగవాడు పెదవులతో మాయలు చేసి, అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము; వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు” (సామెతలు. 26:25). యేసుక్రీస్తు యొక్క కాలమునందు మత నాయకులుగా పరిసయ్యులు, సద్దుకయ్యలు, శాస్త్రులు మొదలగువారు ఉండెను. అయినను అట్టివారు ఆత్మీయులుగా ఉండలేదు. నిజముగా కపటము లేని ఇజ్రాయేలీయుగా ఉండలేదు. సాంప్రదాయ ఆచారములను, పారంపర్యములను ఆచరించిరి. వారి యొక్క హృదయమైతే ప్రభువునకు దూరముగా ఉండెను.

ప్రభువు అట్టివారిని “సున్నము కొట్టబడిన సమాధులారా, వేషధారులారా” అని పిలిచెను. “ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు; గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండియున్నారు” (మత్తయి. 23:28) అని గద్దించెను.

బైబిలు గ్రంథము అంతట ఏడు స్థలములలో: “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ!” అని ప్రభువు చెప్పియున్నాడు. కపటము గల జీవితమును ప్రభువు ద్వేషించుచున్నాడు. వేషధారణ జీవితమును ప్రభువు కోరుకొనుటలేదు. దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితమును నిష్కపటమైన జీవితముగా కట్టి లేవనిత్తుడి. సత్యమును సత్యముగా మాట్లాడుడి. మీ యొక్క పెదవులు మాట్లాడు సంగతిని, మీ యొక్క హృదయము అంగీకరించవలెను. అప్పుడే ప్రభువు యొక్క దృష్టిలో స్పష్టతను పొందుకొందురు.

నేటి ధ్యానమునకై: “యెహోవాచేత నిర్దోషి అని యెంచ బడినవాడును, ఆత్మలో కపటము లేనివాడును ధన్యుడు” (కీర్తనలు. 32:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.