Appam, Appam - Telugu

సెప్టెంబర్ 11 – అల్లాడించబడు పరిశుద్ధాత్ముడు!

“భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; … దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను” (ఆది.కా. 1:2).

నిరాకారమును, శూన్యమును, చీకటిని మార్చి ఆకారమును, నిండుతనమును, వెలుగును తీసుకొని వచ్చుటకు నేడును పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు. జీవమును కలుగజేసి, నిండుతనమును తీసుకుని వచ్చుటకు ఆయన సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు అల్లాడింపగా, అల్లాడింపగా నిరాకారము మారి, అందమును, మనస్సునందు నిండుతనమును, కలుగజేయబడును. చీకటి వెలుగుగా మారును.

నేడును మీ యొక్క గృహము కూడాను నిరాకారముగాను, శూన్యముగాను ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మను ప్రేమతో పిలువుడి. “ఆదియందు జలముపై అల్లాడుచుండిన పరిశుద్ధాత్ముడా, నేడును మాపై అల్లాడించబడి దైవ సంతోషమును, సమాధానమును తీసుకుని రమ్ము” అని అడుగుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీవు నీ (ఊపిరి విడువగా) ఆత్మను పంపించుచున్నప్పుడు, అవి సృజింపబడును; అట్లు నీవు భూతలము యొక్క రూపమును నూతన పరచుచున్నావు” (కీర్తనలు. 104:30).

పరిశుద్ధాత్ముడు అల్లాడించబడుట, ఒక పక్షి గుడ్డును పెట్టి దానిపై ప్రేమతో పొదుగుకు కూర్చుండుటను సూచించుచున్నది. పొదుగుచున్నప్పుడు పక్షి యొక్క వెచ్చదనముచే, గుడ్డులో ఉన్న రూపము లేని ద్రవములో అందమైన రూపముగల పిల్ల రూపించబడుచున్నది. ఆ సంగతి మనుష్యుని యొక్క బుద్ధికి అందదు. అదేవిధముగా నిరాకారముగా ఉన్న స్థితిలో నుండి, ప్రభువు గొప్ప మహిమగల ఒక అంశమును సృష్టించుటకు అల్లాడుచున్నాడు.

పరిశుద్ధాత్మను బైబిలు గ్రంధములో మొట్టమొదటిసారిగా ఆదికాండము 1 : 2 ‘వ వచనములో సంధించుచున్నాము. అప్పుడు పనిని చేయుటకు ప్రారంభించిన పరిశుద్ధాత్ముడు, ప్రకటన గ్రంథము 22:17 ‘వ వచనము వరకు కొనసాగించి పనిని చేయుటను చూడవచ్చును. ఆయన పనిని చేయుచున్నప్పుడు, అక్కడ జీవము కలుగుజేయబడెను. సృష్టి యొక్క శక్తి బయలుపరచ బడుచున్నది. అదే సమయము ఆయన పనిచేయక పోయినట్లయితే నిరాకారమును, శూన్యమును, చీకటియు అక్కడకు మరల వచ్చును.

ఆదియందు ప్రకృతిపై అల్లాడించబడిన పరిశుద్ధాత్ముడు, ఆ తరువాత మనుష్యునిపై అల్లాడించబడుటకు ప్రారంభించెను. అపరాధముల చేతను, పాపముల చేతను, చచ్చిన వారైయున్న మనుష్యుడ్ని జీవింపచేయుటకు అల్లాడింపబడెను. “ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము” (యోహాను. 6:63). లోకమునందు గల ఎట్టి మనుష్యుడునైనను జీవింపజేసి, స్థిరపరచి, బలపరచి వారి యొక్క జీవితములోనికి ఆకారమును నిండుతరమును వెలుగును తీసుకుని వచ్చుటకు ఆయన శక్తి గలవాడై ఉన్నాడు.

పరిశుద్ధాత్ముడు నేడును సంఘములపై అల్లాడింపబడుచున్నాడు. “పరిశుద్ధాత్ముడు సంఘములకు చెప్పుచున్న మాటను చెవిగలవాడు వినును గాక” అని ప్రకటన గ్రంథము లోని 2, 3 అధ్యాయములలో ఏడుసార్లు చెప్పబడియున్నది. మీకు పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును వినేటువంటి చెవులు ఉండినట్లయితే, ఆయన యొక్క మృదువైన స్వరమును స్పష్టముగా వినవచ్చును.

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఆత్మను మీపై అల్లాడింపబడును గాక! మిమ్ములను జీవింపచేయను గాక!

నేటి ధ్యానమునకై: “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” (రోమీ. 8:26).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.