సెప్టెంబర్ 04 – ఎక్కడికి పోయినను!
“గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోయినను అక్కడికెల్ల ఆయనను వెంబడింతువారు; వీరే” (ప్రకటన. 14:4).
అపో. యోహాను ఆత్మవశుడై పరలోక రాజ్యమునందుగల సియోను పర్వతమును తేరి చూచినప్పుడు, అక్కడ తండ్రి యొక్క నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ నిలబడియుండుటను చూచెను.
గొర్రెపిల్లయైనవాడు ఎక్కడికి పోయినను, ఆయనను వెంబడించువారు వీరే. అవును, వారి కాళ్లకు ఒక తీర్మానము ఉండెను. గొర్రెపిల్లయైనవాడిని ఎల్లప్పుడును, ఎల్లకాలమందును, ఎట్టి పరిస్థితియందును వెంబడించవలెను అనుటయే. ఆయన యొక్క అడుగుజాడలను వెంబడించువారు అజ్ఞానులైనను దిక్కుమాలినవారు కాదు.
మీ యొక్క కాళ్ళను ప్రతిష్టించుకొనుడి. మీ నడకను క్రీస్తునందు స్థిరపరచుకొనుడి. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించి, పరిశుద్ధ మార్గమునకు మార్గదర్శిగా ఉండెను. “మీరు తన యొక్క అడుగుజాడలను వెంబడించి వచ్చునట్లుగా మీకు మాదిరియుంచి పోయెను” (1. పేతురు. 2:21).
ఒక సహోదరి ఉపవాసముండి, “ప్రభువా, సాధు సుందర్ సింగ్గారిని నేను చూడవలెను” అని ప్రార్థించెను. ఆమెకు ప్రభువు ఒక దర్శనమును చూపించేను. అందులో గొర్రె పిల్లయైన యేసుక్రీస్తు నడిచి వెళ్ళుటను, ఆయన వెనుక సాధు సుందర్ సింగ్గారు నడుచుటను చూచెను. ఎంతటి ఆశ్చర్యము! యేసు ఏ స్థలమునందు తన కాళ్ళ అడుగును వేయుచుండెనో అదే స్థలములో సాధు సుందర్ సింగ్గారు తన కాళ్ళ అడుగును వేయుచు యేసు వెళ్లిన బాటలో వెంబడించి వెళ్ళుటను చూచెను. సాదు సుందర్ సింగ్గారి కాళ్ళకు చెప్పులు కూడా తొడుగుకొనక ఉత్తి కాళ్లతో క్రీస్తును వెంబడించుటను జీవితము యొక్క లక్ష్యముగా కలిగియుండెను.
క్రీస్తు ఎలాగున తండ్రి యొక్క చిత్తమును పరిపూర్ణముగా చేసెనో, అదేవిధముగా మనము కూడాను క్రీస్తు యొక్క చిత్తమును పరిపూర్ణముగా చేయుచున్నప్పుడు, క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడించువారిగా ఉందుము. అట్టి అడుగుజాడలు పరిశుద్ధతకును, పరలోకమునకును తిన్నగా మనలను త్రోవ నడిపించుచున్నది. కావున నేను మాట్లాడుట సరియైనదేనా, ఈ స్థలమునందు క్రీస్తు నిలబడినట్లయితే ఏమని మాట్లాడియుండును, నా యొక్క కోరికయు ఆయన యొక్క కోరికయు ఒకటిగా కలిసి పయనించుచున్నదా అని పరిశీలించి పరిశోధించు కొనవలెను.
క్రీస్తు లేఖన వాక్యానుసారముగా నడిచెను. లేఖన వాక్యములను నెరవేర్చునట్లుగా, ఆయన తన్నుతాను సమర్పించుకొనెను. లేఖన వాక్యములే, ఆయన కాళ్లకు దీపమును, త్రోవకు వెలుగునైయుండెను. యేసు క్రీస్తే మార్గమును సత్యమును జీవమునైయున్నవాడు (యోహాను. 14:6). “నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల, వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేతను మేయుచునుండును” (యోహాను. 10:9) అని యేసు చెప్పుచున్నాడు.
దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడింప కోరినట్లయితే, బైబులు గ్రంథమును వెంబడించుడి. ఆయన మాటలకు లోబడుడి. క్రీస్తును మాత్రమే ప్రియపరచెదను అని తీర్మానించుడి.
నేటి ధ్యానమునకై: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మీరును నన్ను పోలి నడుచుకొనుడి” (1. కోరింథీ. 11:1)