Appam, Appam - Telugu

జూలై 10 – సింహాసనములో నుండి స్వరము!

“మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్దనుండి వచ్చెను” (ప్రకటన. 19:5).

ఇంత వరకు పరలోకము నుండి పుట్టిన పలు స్వరములను, ఆ స్వరములు యొక్క ఉద్దేశములను, ఆ స్వరముల యొక్క కాంక్షలను గూర్చియు కొనసాగించి ధ్యానించుచు వచ్చాము. నేడు పరలోకమునందు గల సింహాసనములో నుండి వచ్చుచున్న స్వరము గూర్చి కొద్దిగా ధ్యానించెదము.

భూమిలోనుండి వచ్చుచున్న స్వరములకు చెవియొగ్గుట కంటేను, పరలోకము నుండి, దేవుని యొక్క సింహాసనములో నుండి, దేవాది దేవుని యొద్ద నుండి వచ్చుచున్న స్వరమునకు లోబడి చెవియొగ్గుట ఎంతటి అవశ్యము! ఆ స్వరమునకు చెందినవాడు సర్వశక్తిమంతుడైయుండుట చేత, అట్టి స్వరమును ఎవరు నిర్లక్ష్యము చేయలేరు.

ప్రకటన గ్రంథమునందు, మూడు స్థలములలో, సింహాసనము నుండి బయలుదేరిన స్వరములను మీరు వినవచ్చును. మొదటిది, “సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి” (ప్రకటన. 4:5) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. భూమి మీద ఒక్కొక్క దేశమునకును సింహాసనము కలదు. అందులో ఆసీనులగు రాజులకు ఏలుబడియు, అధికారమును కలదు. కొన్ని సింహాసములయందు సార్వభౌములు ఆసీనులైయుందురు. కొన్ని సింహాసములయందు రాష్ట్రపతులును, కొన్నిటియందు ప్రధాన మంత్రులును ఆసీనులైయుందురు. అయితే ఈ లోకము నందుగల సింహాసనములన్నియును తాత్కాలికమైనవియే.

నెబుకదుర్నెజరునకు గొప్ప సింహాసనము ఉండినప్పటికీ కూడాను, ఆయన హృదయము అతిశయము చెంది, ఆయన యొక్క ఆత్మ గర్వముచేత కఠినపరచబడినప్పుడు, ఆయన తన యొక్క సింహాసనములో నుండి త్రోసివేయబడెను. ఆయన యొక్క మహిమ ఆయనను విడిచి తొలగిపోయేను. (దానియేలు. 5:20).

అయితే పరలోకపు సింహాసనము, నిత్యమైన సింహాసనమైయున్నది. అందులో ఆశీనుడైయున్న తండ్రియైన దేవుని యొక్క కుడిపాశ్వమునందు బహుఠీవిగా యేసుక్రీస్తు ఆసీనుడైయున్నాడు. ఆ సింహాసనము నుండి మెరుపులును, ఉరుములును, శబ్దములును బయలుదేరెను. మెరుపులు ఆయన పరిశుద్ధతయందు బహు భయంకరుడు అను సంగతిని, ఉరుములు ఆయన శక్తియందు పరాక్రమముగలవాడు అను సంగతిని, శబ్దములు ఆయన మనుష్యులతో ముఖాముఖిగా శాసనములను ఇచ్చువాడు అను సంగతిని బయలుపరచుచున్నది.

ఇప్పుడు కూడాను, ఆ సింహాసనము నుండి ఒక శబ్దము బయలుదేరినట్లు ఉన్నది. “మరియు, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను” (ప్రకటన. 19:5).

దేవుని బిడ్డలారా, మీరు ప్రభువును స్తుతించునట్లుగా సృష్టించబడియున్నారు. ప్రభువును స్తుతించి, స్తోత్రించి, ఆరాధించి ఆయనకు మహిమను చెల్లించుడి.

నేటి ధ్యానమునకై: “నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము, జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చెదను” (ప్రకటన. 3:21).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.