అక్టోబరు 11 – రెక్కల మీద!
“వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను” (ద్వితీ. (32:11).
తల్లి గ్రద్ద తన రెక్కలను విప్పుచున్నప్పుడు, కొన్ని గ్రద్ధ పిల్లలు తల్లి మీద ఉన్న ఆప్యాయత వలన తనకు తానుగానే వచ్చి రెక్కల మీదకు ఎక్కును. అయితే కొన్ని గ్రద్ద పిల్లలును తల్లి గ్రద్ద బలవంతముగా రెక్కల మీదకు ఎక్కించుకొనును.
ఈతను నేర్పించువారు పిల్లలను నీటిలోనికి దూకమని చెప్పుదురు. పిల్లలు కూడా తాము కలిగియున్న ఆత్రుతను బట్టి నీళ్లలోనికి దూకి కొద్ది సమయములో ఈతను కొట్టుటకు నేర్చుకొందురు. మరి కొందరైతే నీళ్లను చూచిన వెంటనే భయపడి జంకుచూ, నిలబడుచున్నప్పుడు, ఇతరులు బలవంతముగా నీటిలోనికి వారిని త్రోసివేయుదురు. ఎలాగైనను, అట్టివారు ఈతను నేర్చుకొందురు.
నాలుగు వందల ముఫై సంవత్సరములు ఐగుప్తు అను గూటిలో నివసించిన ఇశ్రాయేలీయుల కొరకు ప్రభువు తన యొక్క రెక్కలను చాపెను. అనేకులకు ఐగుప్తును విడిచి వచ్చుటకు ఇష్టము లేకుండెను. కావున, ప్రభువు ఒకవైపున ఫరో యొక్క హృదయమును కఠినపరిచెను.
మరోవైపున పది తెగుళ్లను పంపించెను. అంతమునందు ఇశ్రాయేలీలను ప్రేమతో ఐగుప్తును విడిచి బయటకి తీసుకొని వచ్చెను. ఎర్ర సముద్రము అద్భుతముగా వారికి దారిని ఇచ్చెను. నలభై సంవత్సరములు అరణ్యములో ప్రభువు యొక్క కార్యములను కన్నులారా చూచుచు ఆయనతో నడిచిరి.
ఆ సంగతిని జ్ఞప్తి చేయుచు ప్రభువు చెప్పెను: “నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి” (నిర్గమ. 19:4).
తల్లి యొక్క రెక్కలపై ఎక్కియున్న గ్రద్ద పిల్లలకు తట్టుకోలేనంత ఆనందము కలిగి ఉండవచ్చును. బావి కప్పలవలె ఇంతవరకును గూటిలోనే ఉండి, అదియే ప్రపంచము అని తలంచుచు ఉన్న గ్రద్ద పిల్లలు, ఇప్పుడు ప్రపంచమంతటిని సంచరించి చూచుచున్నాయి.
దాని తర్వాత ఒక్కొక్క పిల్లను తన యొక్క రెక్కలపై ఎక్కించుకొని, ఆకాశము యొక్క ఎత్తులోనికి వెళ్లి అకస్మాత్తుగా ఆ తల్లి గ్రద్ద తన రెక్కలను ముడుచుకుని పిల్లలను ఆకాశములోనే విడిచి పెట్టును. రెప్పపాటు సమయములో ఇది జరిగినను ఆ గ్రద్ద పిల్లలు మిగుల భయముతో తన రెక్కలను వేగముగా కొట్టుకొని ఎగురుటకు ప్రయత్నించుచున్నది. నేలపై పడి చనిపోదునేమో అను భయము మరోవైపున గ్రద్ద పిల్లను పట్టిపీడించును.
అయినను రెక్కలలో చాలినంత బలము లేనందున అవి నేలతట్టునకు వేగముగా పడిపోవుచున్నట్లు వచ్చుచుండును. అయితే మరు క్షణములో తల్లి గ్రద్ద బహువేగముగా ఎగురుతూ వచ్చి తన యొక్క పిల్లలకు క్రింద తన యొక్క రెక్కలను చాపి, ఆ పిల్లలను ఆదుకొనుచున్నది. అలాగున పలుసార్లు చేసి చివరిలో, ఆ గ్రద్ద పిల్లలు చక్కగా ఎగురుటకు నేర్చుకొనిన తరువాత తల్లి గ్రద్దవలె బహు చక్కగా ఎగిరి వెళ్ళుచుండును.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క రెక్కలపై మీరు కూర్చుండు గొప్ప ఔన్నత్యమైన అనుభవములను వాన్చించవలెను.
నేటి ధ్యానమునకై: “యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు” (యెషయా. 40:31).