Appam, Appam - Telugu

అక్టోబరు 01 – ఇది సమయమా?

“ద్రవ్యమును సంపాదించుకొనుటకును వస్త్రములను, ఒలీవచెట్ల తోటలను, ద్రాక్షతోటలను, గొఱ్ఱెలను ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకును ఇది సమయమా?” (2. రాజులు. 5:26).

ఇది సమయమా అని ప్రవక్తయైన ఎలీషా అడుగుచున్నాడు. ఆస్థితో ఆస్థిని కలుపుకుంటూ ఉండుటకును, పొలముతో పొలమును కలుపుకుంటూ ఉండుటకును ఇది సమయమా అనుటయే ఆయన ప్రశ్న.

ఎలీషా యొక్క సేవకుని పేరు గేహజీ. అతని యొక్క హృదయము ధనాశచేత నిండియుండెను. ఎలీషాను వెంబడించి ఆయన మీద ఉన్న ఆత్మ వరమును వెయ్యిరెట్లుగా పొందుకొని ప్రభువునకు బహు బలమైన పరిచర్యను చేయు తలంపును విడిచిపెట్టి, వస్త్రములను, ఒలీవచెట్ల తోటలను, ద్రాక్షతోటలను సంపాదించు కొనుటయందే తన మనస్సును ఉంచెను.

సిరియా దేశము యొక్క సైన్యాధిపతియైన నయమాను, అతని కుష్టువ్యాధి స్వస్థత పొంది, తన దేశమునకు తిరిగి వెళ్ళుటను చూచిన వెంటనే నయమాను వద్దనుండి తనకు ఏదైనా దొరుకుతుందా అని అతడు కాంక్షించెను. తన యజమానుడైన ఎలుషాకు తెలియకుండా నయమాను యొక్క రధము వెనకే పరుగెత్తెను.

నయమానును చూచి, “అయ్యా! ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి వచ్చిరి. వారికొరకు రెండు మణుగుల వెండియు, రెండు మార్చు దుస్తుల బట్టలును పుచ్చుకొని వచ్చునట్లుగా నా యజమానుడు నన్ను పంపెను” అని చెప్పెను.

ఇలాగున వెళ్లి చెప్పి, ధనాపేక్షను ఆశ్రయించి ప్రభువునకు ద్రోహము చేసిన గేహజీ మీద ప్రభువు యొక్క న్యాయతీర్పు వచ్చెను. ఎలీషా గేహజీని చూచి: “నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా: వెంటనే వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను” (2. రాజులు. 5:27).

ప్రభువు కృపగా అనుగ్రహించిన పగటి కాలమును ఆయన నామము యొక్క మహిమ కొరకు ఉపయోగించకుండా, విదేశీ ధనములపై మోహించి, దొంగ లెక్కలను వ్రాసి, దొంగ ఖాతాలను చూపించి, ధనాశలో మత్తులైయున్న వారిపై ఎంతటి భయంకరమైన ఉగ్రతాగ్ని వచ్చును! బైబిలు గ్రంథము హెచ్చరించుచున్నది: “ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” (1. తిమోతికి. 6:10).

నేడును మన దేశములో లంచగొండితనము పెరిగిపోయెను. చిన్న పనిని చేసి పెట్టుటకు కూడాను లంచము ఇవ్వవలసినదైయున్నది. ధనమును సంపాదించుటకు మనుష్యుడు అడ్డదారిలో వెళ్ళుచున్నాడు. అబద్ధమునాడి సంపాద్యమును పెంచుకొనుటకు యెత్నించుచున్నాడు. నిత్యత్వము వారిని వెలివేయుచున్నప్పుడు, వారు దౌర్భాగ్యులుగా నిలబడుదురు.

దేవుని బిడ్డలారా, నిత్యత్వమునకు సంబంధించిన అంశములలో మీయొక్క మనస్సును నిలుపుడి. మీయొక్క ధనమును ప్రయోజనకరముగా ఖర్చుపెట్టుడి. పరలోకపు అంశముల కొరకు మీ యొక్క సమయమును పెట్టుబడి చేయుడి. అప్పుడు మీరు నిరంతరమును ఆనందించి ఉల్లసించుదురు.

నేటి ధ్యానమునకై: “కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది; మారుమనస్సును పొంది, సువార్తను నమ్ముడి” (మార్కు. 1:15).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.