ఆగస్టు 24 – ముట్టుడి!
“నీ వస్త్రపుచెంగును మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టిన వారందరును స్వస్థతనొందిరి” (మత్తయి. 14:36).
అపో. యోహాను: “మేమేది …., కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ జీవవాక్యమును గూర్చినది మీకు తెలియజేయుచున్నాము” అని వ్రాయుచున్నాడు (1. యోహాను. 1:1).
ఆనాడు కొందరు ఆయనను చేతితో ముట్టిరి. కొందరు విశ్వాసముతో ఆయనను ముట్టిరి. ఒక కనాను స్త్రీ యేసు వద్దకు వచ్చెను. ఆమెకు ఒక సమస్య ఉండెను. ఆమె యొక్క కుమార్తె దురాత్మ పోరాటము చేత మిగుల వేదన పడుచుండెను. ఆమె అన్యజనురాలైన స్త్రీయై ఉండుటచేత యేసును సులువుగా ముట్ట లేకపోయెను. పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట మంచిది కాదు అని యేసు కూడాను చెప్పెను.
అయితే ఆమె ఎలాగైనను యేసును ముట్టునట్లుగా కోరెను. ఎలా ముట్టెను తెలియునా? “నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా” (మార్కు. 7:28) అను మాట చేత యేసు యొక్క హృదయమును బహులోతుగా ఆమె ముట్టెను! తన యొక్క తగ్గింపుచేతను, విశ్వాసపు మాటచేతను తన కుమార్తకు విడుదలను ఆమె పొందుకొనెను!
అదేవిధముగా శతాధిపతి కూడాను యేసును ముట్టెను. అది కూడాను విశ్వాసపు మాటల వలనే. “ప్రభువా! …. మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును” (మత్తయి. 8:8). అట్టి విశ్వాసపు మాటలు యేసు యొక్క హృదయమును ముట్టెను. యేసు కూడా ఆ మాటలను విని ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని చెప్పి శతాధిపతి యొక్క దాసుడ్ని స్వస్థపరచెను.
ఒక పుట్టు గ్రుడ్డివాడు యేసుని తన చేతులతో కాక, తన శబ్దముచేతను పట్టు విడువని ప్రయత్నముచేతను ముట్టెను. ‘దావీదు కుమారుడా, నన్ను కరుణించుము’ అని మరలా మరలా బతిమిలాడి శబ్దము పెట్టెను. అతని యొక్క మాటలు యేసు యొక్క హృదయమును ముట్టి కరిగిపోవునట్లు చేసెను. అతడు చూపును పొందుకొనెను!
ఒక పేద విధవరాళ్లు ప్రభువు యొక్క హృదయమును ముట్టెను. తాను కలిగియున్న వాటినెల్లెను ప్రభువునకు మనఃపూర్వకముగా ఇచ్చి ప్రభువు యొక్క హృదయమును ముట్టెను. రెండు కాసులు వేసిన వెధవరాళ్లను యేసు సంతోషముతో మెచ్చుకుని: “అక్కడ ఉన్న వారందరికంటేనే ఈ పేద వెధవరాళ్లు అత్యధికముగా వేసెను” అని చెప్పెను.
జక్కయ్య ప్రభువును ముట్టెను. అడవి మేడి చెట్టున ఎక్కియున్న జక్కయ్య యొక్క హృదయము ఒక నూతన తీర్మానమును తీసుకునెను. నేను ఎవనివద్దనైనను అన్యాయముగా తీసుకొనిన యెడల దానిని నాలుగు రెట్లుగా తిరిగి చెల్లించెదను అను తీర్మానమును ఆయన జరిగించెను. ఇట్టి తీర్మానము యేసు యొక్క హృదయమును ముట్టెను. ప్రభువు ప్రేమతో: ‘నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేను’ అని చెప్పి సంతోషించెను.
దేవుని బిడ్డలారా, మీరు కూడాను యేసును మీ యొక్క విశ్వాసపు మాటలచేత ముట్టుచున్నప్పుడు, మీకు కూడాను ఆయన విడుదలను ఇచ్చుటకు శక్తి గలవాడైయున్నాడు.
నేటి ధ్యానమునకై: “యెహోవా తన చేయి చాపి, నా నోరును ముట్టి, …. ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను” (యిర్మియా. 1:9).