నవంబర్ 25 – యెహోవా యీరే!
“అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను; అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును” (ఆది.కా. 22:14).
ప్రభువు యెహోవా యీరే అను నామములో తనను బయలుపరుచున్నాడు. యెహోవా యీరే అనుటకు యెహోవా పర్వతముమీద చూచుకొనబడును అనుట అర్థమునైయున్నది. ప్రభువు మన ప్రతి ఒక్కరికి జీవితములోను యెహోవా యీరేగా, మన యొక్క అవసరతలను దర్శించువాడైయున్నాడు.
ప్రభువు ఒకసారి అబ్రహామును చూచి: “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని, మోరీయా దేశమునకు వెళ్లి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను” (ఆది.కా. 22:2).
ఈ మాటను విన్నప్పుడు అబ్రహాము యొక్క హృదయము బద్దలై పోయి ఉండవలెను. ఆయనను ఆయన, ప్రభువు తన యొక్క విధేయతను శోధించి ఎరగవలెనని కోరుచున్నాడు అను సంగతిని ఎరిగి, సణుగుకొనక తనకు ఒక్కడైయున్న కుమారుడైన ఇస్సాకును మోరియా కొండ శిఖరమునకు తీసుకొని వెళ్లెను.
వెళ్ళుచున్న మార్గములో ఇస్సాకు తన తండ్రియైన అబ్రహాము వద్ద నిప్పును కట్టెలును దహన బలికి ఉన్నప్పుడు గొర్రె పిల్ల ఎక్కడ అని అడిగెను. అందుకు అబ్రహాము, దేవుడు తమ దహనబలి కొరకు కావలసిన గొర్రె పిల్లను తానే చూచుకొను అని చెప్పెను. ఆ స్థలమును వచ్చినప్పుడు, బలిపీఠమును సిద్ధపరచి, ఇస్సాకును బలిపీఠముపై పరుండబెట్టి, కత్తెను ఎత్తి నరుకుచున్న సమయములో, పరలోకము నుండి ప్రభువు యొక్క దూత, అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు: చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన: “ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను” (ఆది.కా. 22:12).
అంత మాత్రమే కాదు, “అబ్రాహాము కన్నులెత్తి చూడగా, పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను; అప్పుడు అబ్రాహాము వెళ్లి, ఆ పొట్టేలును పట్టుకొని, తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను; అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును” (ఆది.కా. 22:13,14).
ఇందులో నుండి ఒక సంగతిని మనము స్పష్టముగా తెలుసుకొనవచ్చును. ప్రభువు మన యొక్క ప్రతి అవసరతను ఎరిగినవాడైయున్నాడు. దానిని మన కొరకు సిద్ధపరచి ఉంచియున్నాడు. మనము ఆయన తట్టు తేరి చూచుచున్నామా అని కొన్ని సమయములలో మనలను శోధించుచున్నాడు. అటువంటి సమయములలో సణుగుకొనక, ప్రభువును దృఢముగా పట్టుకుని యెహోవా యీరే అని పిలిచినట్లయితే, ప్రభువు మనయందు ప్రత్యక్షమగును, అద్భుతములను చేయును. ఆశ్చర్యముగా నడిపించును. దేవుని బిడ్డలారా, ఎటువంటి అవసరత అయినను, ప్రభువు దానిని నెరవేర్చుటకు సమర్థుడైయున్నాడు.
నేటి ధ్యానమునకై: “ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు” (యోబు. 5:9).