Appam, Appam - Telugu

జూన్ 26 – అగ్నిస్తంభము!

“ఆ మందసము సాగినప్పుడు, మోషే: యెహోవా, లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక; …. యనెను” (సంఖ్యా. 10:35).

ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు బయలుదేరవలెను అని ప్రభువు తలంచెనో అప్పుడు పగలైనయడల మేఘస్తంభమును, రాత్రియైయుంటే అగ్నిస్తంభమును లేచును. ప్రభువు లేచుచున్నాడు అని తంచినప్పుడు అగ్నిస్తంభము కూడాను లేచుచున్నది, నిబంధన మందసపెట్టె లేచుచున్నది. ఇశ్రాయేలు ప్రజలు లేచుటకు మొదలుపెట్టుచున్నారు. ప్రభువు మన కొరకు లేచుచున్నప్పుడు, మనము కూడాను ప్రభువు కొరకు లేవవలెను.

అగ్ని స్తంభము లేచుచున్న రాత్రి సమయమును మనోనేత్రములకు ముందుగా తీసుకొని రండి. ఒక పెద్ద రాకెట్టును అంతరిక్ష్యమునందు చంద్రమండలమునకు పంపించుచున్నపుడు, మంటలను ఆగ్నిని వెల్లుగక్కుచు అది పైకి లేచును. అది ప్రయాణమై వెళ్ళుచున్న స్థలమంతయు ధూమమండలముగా ఉండును. ప్రభువు లేచున్నప్పుడు ఒక కోటి రాకెట్లు లేచునట్లుగా అంతటి అగ్ని జ్వాలతో అగ్నిస్తంభముగా లేచును. అడవి మృగములు, విష జంతువులు అలమట్టించుచు పారిపోవును. విషపూరితమైన సర్పములును తేళ్లును కాల్చివేయబడును.

రాత్రియందు చీకటిని వెలుగుగా చేసి, చల్లదనమును వెచ్చగా చేసి మంచి శీతోష్ణ పరిస్థితితో ప్రకాశవంతమైన వెలుగులో ఇజ్రాయేలు ప్రజలు నడుచుదురు. ప్రభువు మనతో ఉండుటయును, మనతో కూడా లేచుటయును, మనతో నివసించుటయును ఎంతటి ధన్యకరమైనది! అగ్నిస్తంభము లేచున్నప్పుడల్లాను ప్రభువు తమ కొరకు లేచుటను వారు గ్రహించిరి. శత్రువు వరదవలె వచ్చుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ కొరకు ధ్వజమును ఎత్తును.

ప్రభువు ఎటువంటివాడు? “ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను” (ప్రకటన. 1:14). “నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను; చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను.” (యెహేజ్కేలు. 1:27) అని యెహేజ్కేలు ప్రవక్త వ్రాయుచున్నాడు.

అంత మాత్రమే కాదు, “ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలెను, దాని చక్రములు అగ్నివలె మండుచుండెను; అగ్నివంటి ప్రవాహము ఆయన యొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయన యెదుట నిలిచిరి” (దానియేలు. 7:9,10) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.

అట్టి దేవుడు సర్వశక్తిమంతుడిగా లేచినట్లయితే, అట్టి దృశ్యము ఎంతటి ప్రకాశవంతముగా ఉండును! ఆయన యొక్క శత్రువులు పారిపోదురు, చెదరగొట్టబడుదురు. ఆయనను చూచుచున్నప్పుడు, అపవిత్ర ఆత్మలు విలపించుచు పారిపోవును. చేతబడి శక్తులు విరవబడును. మాంత్రిక కట్లు కాల్చి వేయబడును.

దేవుని బిడ్డలారా, అట్టి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన మనతో నిబంధనను చేసియున్నాడు. ఆయన మన కొరకు లేచును. ఆయన మనకు ప్రేమగల తండ్రిగా ఉన్నాడు. ఆయన మన విరోధులను దహించు అగ్నియైయున్నాడు (హెబ్రీ. 12:29).

నేటి ధ్యానమునకై: “నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు” (జెకర్యా. 2:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.